Let's talk: editor@tmv.in
మేం వచ్చాక మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం: రాహుల్ గాంధీ

మేం వచ్చాక మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం: రాహుల్ గాంధీ

Pinjari Chand
10 డిసెంబర్, 2025

ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవిలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి చట్టపరమైన రక్షణ కల్పించే నిబంధనను రిట్రోస్పెక్టివ్‌గా మార్చుతామని హెచ్చరించారు.సీఈసీ, ఈసీలు ప్రస్తుతం చట్టం తమకు రక్షణ ఇస్తుందని అనుకుంటున్నారు. కానీ మేము ఆ చట్టాన్ని వెనక్కి తీసి మార్చుతాం. మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. 2023లో చేసిన చట్టంలో 16వ క్లాజ్ ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు బాధ్యత లేకుండా రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంస్థలను బీజేపీ అదుపు చేస్తోంది

సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణంగా మార్చుతున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కు సమానత్వం నచ్చదు. దేశాన్ని వివిధ మతాలు, భాషలు, సమూహాలు సమానంగా ఉన్న దేశం అన్న భావనే వారికి అంగీకారం లేదు. వాళ్లకు జాతి క్రమ వ్యవస్థ, హైరార్కీ నచ్చుతుందని విమర్శించారు. మహాత్మా గాంధీ ఆయన ధరించిన ఖాదీ అర్థం ఓటు అన్ని దారాలను ఒకే వస్త్రంగా నేసినట్టు దేశాన్ని కలుపుతుందని అన్నారు. భారత ప్రజాస్వామ్యం ఓటు ద్వారా రూపొందిన వ్యవస్థ అని కూడా ఆయన తన ప్రసంగంలో వివరించారు.

ప్రధానంగా ఆయన ఈ కింది ఎన్నికల సంస్కరణలను ప్రతిపాదించారు

• ఎన్నికలకు ఒక నెల ముందు రాజకీయ పార్టీలకు మెషిన్-రీడబుల్ ఓటర్ల జాబితా ఇవ్వాలి

• ఎన్నికల వీడియో ఫుటేజ్‌ను 45 రోజుల తర్వాత నాశనం చేసే మార్గదర్శకాలను ఉపసంహరించాలి

• ఈవీఎంల ఆర్కిటెక్చర్‌ను పార్టీలకు చూపించి, యాక్సెస్ ఇవ్వాలి

• సీఈసీ, ఈసీల నియామక కమిటీ నియమావళిని మార్చాలి

• పదవీ బాధ్యతల్లో తీసుకున్న నిర్ణయాలకు ఇచ్చిన న్యాయపరమైన రక్షణ (ఇమ్యూనిటీ) చట్టాన్ని రద్దు చేయాలి

రాహుల్ గాంధీ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు తరచూ అడ్డుకున్నా..సూచనలతో కూడిన విమర్శను కొనసాగించారు.