
మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం: సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పేరుతో చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రజలనుద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేశారు. గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
నిరంతరం శ్రమిస్తున్నాం
"మేము పాలకులం కాదు.. సేవకులం” అన్న భావనతోనే నిరంతరం శ్రమిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయ్యింది. ఈ కాలంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే, అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్నాం. వరుసగా జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మాకు అందించిన విజయాలు బాధ్యతను మరింత పెంచాయి అని వివరించారు.
99 రోజుల లక్ష్యం ఇదే..
ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితంలో మార్పు తేవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు.
• పాలనలో వేగం: మార్చి 6 నుంచి ప్రారంభమైన ఈ 99 రోజుల కార్యాచరణలో అధికారులు గ్రామస్థాయి నుంచి చురుగ్గా పాల్గొనాలి.
• పారదర్శకత: ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత తప్పనిసరి.
• పథకాల అమలు: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ₹ 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలి.
తెలంగాణ రైజింగ్ - 2047
రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ముందుకెళ్తున్నాం. రాష్ట్రాన్ని క్యూర్, పూర్, రేర్ విభాగాలుగా వర్గీకరించుకున్నాం. సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఈ 99 రోజుల కార్యక్రమం ఒక సాధారణ ప్రక్రియ కాదు.. ఇదొక దీక్ష. నాలుగు కోట్ల ప్రజలు భాగస్వాములై నా కలను సాకారం చేయాలి." అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
