
‘మెుంథా తుఫాన్’ భద్రతపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌పై మెుంథా తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలో, ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వచ్చే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు, గాలివానలు, వరదల ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సంధ్యారాణి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు.
ముందుగా, సోమవారం జరగాల్సిన అన్ని జిల్లా గ్రీవెన్స్ సమావేశాలను రద్దు చేయాలని ఆమె సూచించారు. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని, అవసరమైన మందులు, అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అలాగే, విద్యార్థుల భద్రత దృష్ట్యా అవసరమైతే పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. వాగులు, చెరువులు, కొండ చరియల వద్ద ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కొండ ప్రాంతాల్లో భూస్ధలనం జరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని, రైతులు తమ పంటలు రక్షించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే మత్స్యకారులు ఈ సమయంలో సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించి, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని, ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు శాంతంగా, జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
