Let's talk: editor@tmv.in
మెహదీపట్నం వంతెనపై వ్యంగ్యస్త్రాలు

మెహదీపట్నం వంతెనపై వ్యంగ్యస్త్రాలు

Gaddamidi Naveen
13 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌ మహానగరంలో వెలిసిన ఒక వింత కట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెహదీపట్నంలో కొత్తగా నిర్మించిన ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఇంజనీరింగ్ నైపుణ్యానికే సవాలు విసురుతోందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దేశంలో ప్రతి ముగ్గురు పట్టభద్రులలో ఒకరు ఇంజనీర్ ఉన్న తరుణంలో, హైదరాబాద్‌లో నిర్మించిన ఈ వంతెన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మెహదీపట్నం వంటి రద్దీ ప్రాంతంలో పాదచారుల సౌకర్యం కోసం నిర్మించిన ఈ బ్రిడ్జి, ఇప్పుడు ఒక అడ్డంకుల కోర్సు లా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వంతెనపై ఒక చివర నుంచి మరో చివరకు వెళ్లాలంటే సామాన్యులకు సాధ్యం కాదని, దీని కోసం ప్రత్యేకంగా కమాండో ట్రైనింగ్ తీసుకోవాలేమోనని స్థానికులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. బ్రిడ్జి మధ్యలో ఉన్న అడ్డంకులను దాటడానికి కమాండో క్రాస్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ ప్రాజెక్టు నిర్ణయ ప్రక్రియలో ఉన్నవారు కానీ, దీనిని నిర్మించిన వారు కానీ కనీసం ఒక్కసారైనా దీనిపై నడిచి చూశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ఈ వంతెన, కనీస పాదచారుల భద్రతను, సౌకర్యాన్ని పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం కమీషన్ల కోసమే ఇటువంటి అశాస్త్రీయ కట్టడాలను నిర్మిస్తున్నారా? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో, ఇలాంటి వింత నిర్మాణాలను ఇంజనీరింగ్ మార్వెల్ అని పిలవాలో లేక వైఫల్యం అని పిలవాలో అర్థం కాక నగరవాసులు తలలు పట్టుకుంటున్నారు .ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ పనులు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.