
మెస్సీ మ్యాజిక్.. ఇంటర్ మయామికి తొలి ఎంఎల్ఎస్ టైటిల్
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సారథ్యంలో ఇంటర్ మయామి జట్టు చరిత్ర సృష్టించింది. మేజర్ లీగ్ సాకర్ (ఎంఎస్ఎస్) కప్ 2025 ఫైనల్‌లో వాంకోవర్ వైట్‌క్యాప్స్ ఎఫ్‌సీపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి, ఛాంపియన్‌గా నిలిచింది. కేవలం ఆరో సీజన్‌లోనే ఇంటర్ మయామి తమ మొట్టమొదటి ఫిలిప్ ఎఫ్. అన్‌షూట్జ్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఈ విజయంలో మెస్సీ గోల్ చేయకపోయినా, కీలకమైన రెండు అసిస్ట్‌లతో తన మ్యాజిక్‌ను చూపించి, జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మ్యాచ్ హైలైట్స్
ఫైనల్ మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపట్లోనే (8వ నిమిషంలో) ఇంటర్ మయామికి కొంచెం లక్ కలిసి వచ్చింది. టేడియో అల్లెండే గోల్‌పోస్ట్ వైపు కొట్టిన క్రాస్‌ను వాంకోవర్ డిఫెండర్ ఎడియర్ ఒకాంపో అనుకోకుండా తన గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఓన్ గోల్ అయి, మయామి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
సెకండాఫ్ లో వాంకోవర్ జట్టు గట్టిగా పోరాడింది. 60వ నిమిషంలో అలీ అహ్మద్ శక్తివంతమైన షాట్‌తో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే సరిగ్గా ఇక్కడే లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన ఆటతీరుతో మ్యాజిక్ చేశాడు. 71వ నిమిషంలో, అర్జెంటీనా లెజెండ్ మెస్సీ అందించిన అద్భుతమైన అసిస్ట్‌తో రోడ్రిగో డి పాల్ గోల్ చేసి, మయామిని తిరిగి 2-1 ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత కూడా మెస్సీ జోరు కొనసాగింది. మ్యాచ్ ముగియడానికి అదనంగా ఇచ్చిన సమయంలో (96వ నిమిషంలో) మరోసారి మెస్సీ అసిస్ట్ అందించగా, టేడియో అల్లెండే దానిని శక్తివంతమైన షాట్‌తో గోల్‌గా మలిచి 3-1తో ఇంటర్ మయామి విజయాన్ని ఖరారు చేశాడు.
ఈ క్షణం కోసమే ఎదురుచూశా: మెస్సీ
ఎంఎల్ఎస్ ఎంవీపీ (అత్యంత విలువైన ఆటగాడు) అవార్డు అందుకున్న మెస్సీ తన సంతోషాన్ని పంచుకుంటూ, "మూడేళ్ల క్రితం నేను ఎంఎల్ఎస్ కు వచ్చాను, ఇప్పుడేమో మేము ఎంఎల్ఎస్ ఛాంపియన్లం అయ్యాము" అన్నారు. గత సంవత్సరం లీగ్‌లో మొదట్లోనే వైదొలగాల్సి వచ్చింది, అందుకే ఈ సంవత్సరం ఎంఎల్ఎస్ టైటిల్ గెలవడమే మా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాము. జట్టు చాలా కష్టపడింది, ఇది సుదీర్ఘమైన సంవత్సరం. నేను, జట్టు చాలా కాలంగా ఈ విజయం కోసమే ఎదురుచూశాం. ఇది మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ ట్రోఫీకి జట్టు సభ్యులందరూ పూర్తిగా అర్హులు" అని మెస్సీ తన అంకితభావాన్ని వ్యక్తం చేశారు.
ఇంటర్ మయామి ప్రధాన కోచ్ జావియర్ మషెరనో మెస్సీ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. "గత కొన్ని మ్యాచ్‌లలో టైటిల్ గెలవడం తనకెంత ముఖ్యమో చూపించడానికి మెస్సీ చాలా పెద్ద ప్రయత్నం చేశాడు. అతడు ఈ ట్రోఫీని గెలవడానికే ఇక్కడికి వచ్చాడు. అతడి అంకితభావం ఎంత గొప్పదో దీని ద్వారా తెలుస్తుంది" అని మషెరనో కొనియాడారు. ప్రత్యర్థి జట్టు వాంకోవర్‌ను బలమైన జట్టుగా పేర్కొన్న మషెరనో, సెకండాఫ్ లో ఒత్తిడి ఎదురైనప్పటికీ, కొన్నిసార్లు ఛాంపియన్‌గా నిలవడానికి అదృష్టం కూడా అవసరమని, తమకు లక్ కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
