
మెస్సీ ‘గోట్ ఇండియా టూర్’ నిర్వాహకుడికి 14 రోజుల పోలీసు కస్టడీ
ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ 'గోట్ ఇండియా టూర్ 2025' కోల్‌కతా కార్యక్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఈవెంట్ ప్రమోటర్, నిర్వాహకుడు అయిన శతద్రు దత్తాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆదివారం ఆయనను బిధాన్‌నగర్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది.
కోల్‌కతాలో ఏం జరిగింది?
మెస్సీని చూడటానికి చాలా మంది అభిమానులు ఎక్కువ డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అయితే మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానుల నిరాశ కోపంగా మారింది. రాజకీయ నాయకులు (వీఐపీలు), ఇతర ప్రముఖులు మెస్సీ చుట్టూ చేరిపోయి, ఆయన సమయాన్ని పూర్తిగా వాళ్లకే కేటాయించారని, దీంతో కనీసం ఒక్కసారి కూడా మెస్సీని సరిగ్గా చూడలేకపోయామని అభిమానులు ఆరోపించారు. కోపం పట్టలేకపోయిన అభిమానులు స్టేడియంలో సీట్లు, వాటర్ బాటిళ్లను గ్రౌండ్‌లోకి విసిరేశారు. కొందరు గేట్లు పగలగొట్టడానికి, గోల్ పోస్ట్‌ను ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
సీఎం మమతా బెనర్జీ క్షమాపణ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్టేడియంలో జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ దురదృష్టకర సంఘటనలకు లియోనెల్ మెస్సీకి, క్రీడాభిమానులకు క్షమాపణలు చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లో మెస్సీ టూర్ సక్సెస్
కోల్‌కతాలో అభిమానులకు నిరాశ ఎదురైనప్పటికీ, లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ మాత్రం సజావుగా కొనసాగింది. ఈ పర్యటనలో రెండో స్టాప్‌గా మెస్సీ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు చేరుకున్నారు. కోల్‌కతాలో జరిగిన దురదృష్టకర సంఘటన తర్వాత, హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం మాత్రం అభిమానులందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ 7-ఆన్-7 ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్లో ఆడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మెస్సీ తన ఐకానిక్ నంబర్ 10 ఉన్న అర్జెంటీనా జెర్సీని బహూకరించారు. ముఖ్యమంత్రి మెస్సీని జ్ఞాపికతో సన్మానించారు. మెస్సీ ఐక్యరాజ్యసమితి చిన్నారుల నిధి (యూనిసెఫ్) గుడ్‌విల్ అంబాసిడర్‌గా అక్కడ ఉన్న పిల్లలతో కొద్దిసేపు బంతి ఆడి, వారికి మధురమైన జ్ఞాపకాన్ని ఇచ్చారు.
