
మెస్సీకి సీఎం రేవంత్ ధన్యవాదాలు
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి, అతని ఇంటర్ మియామి సహచర ఆటగాళ్లు లూయిస్ సురేజ్, రోడ్రిగో డి పాల్ తమ 'గోట్ ఇండియా టూర్ 2025' రెండో లెగ్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం సమగ్ర ఏర్పాట్లు, సమర్థవంతమైన ప్రణాళిక, క్రమశిక్షణతో విజయవంతంగా ముగిసిందని సీఎం పేర్కొన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి, మా నగరమైన హైదరాబాద్‌కు విచ్చేసి, మా క్రీడాభిమానులందరినీ, ముఖ్యంగా యువతను ఆనందంలో ముంచెత్తినందుకు గోట్ లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సురేజ్, రోడ్రిగో డి పాల్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మా నాయకుడు రాహుల్ గాంధీ జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ సాయంత్రాన్ని జీవితకాలపు జ్ఞాపకంగా మార్చినందుకు మేము ఎంతో కృతజ్ఞులం అని రేవంత్ రెడ్డి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి ‘తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే ప్రతిభ, తెలంగాణ అంటే అతిథి సత్కారం’ అనే సందేశాన్ని చాటామని సీఎం అన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందిని అభినందించారు. అలాగే క్రమశిక్షణతో మెలిగిన క్రీడాభిమానులకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాలర్ మెస్సి, ప్రేక్షకులతో దాదాపు నిండిన స్టేడియంలో మెస్సీ తన అద్భుతమైన నైపుణ్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. మెస్సీ, సువారెజ్, డి పాల్ పాల్గొన్న ‘గోట్ కప్’ పెనాల్టీ షూటౌట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫుట్‌బాల్ కిట్‌లో పాల్గొన్నారు. చిన్నారులతో ఫుట్‌బాల్ క్లినిక్ నిర్వహించగా, చివర్లో జరిగిన సత్కార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
