
మెల్‌బోర్న్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం, చోరీ
ఆస్ట్రేలియాలో మహాత్మా గాంధీ విగ్రహంపై జరిగిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మెల్‌బోర్న్‌లోని రోవిల్లేలో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వద్ద గల బాపూజీ కాంస్య విగ్రహాన్ని అజ్ఞాత దుండగులు ధ్వంసం చేసి, అపహరించారు. ఈ అమానుష ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, దోషులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆస్ట్రేలియా అధికారులను డిమాండ్ చేసింది.
ఆంగిల్ గ్రైండర్‌తో కిరాతకం
సుమారు 426 కిలోల బరువున్న ఈ భారీ కాంస్య విగ్రహాన్ని దుండగులు అత్యంత పక్కా ప్రణాళికతో అపహరించారు. జనవరి 12వ తేదీ తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు ఆంగిల్ గ్రైండర్ ఉపయోగించి విగ్రహం పాదాల వద్ద కత్తిరించి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి కానుకగా ఇచ్చిన ఈ విగ్రహాన్ని 2021లో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆవిష్కరించిన 24 గంటల్లోనే ఈ విగ్రహంపై గతంలోనూ దాడి జరిగింది. ఆ సమయంలో ఈ ఘటనకు ఆస్ట్రేలియాలో, భారతదేశంలో తీవ్ర ఖండనలు వెలువడినప్పటికీ ఎవరినీ అధికారులు అదుపులోకి తీసుకోలేదు.
భారత్ తీవ్ర నిరసన
మరోవైపు తాజా ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. "శాంతి ప్రతీకైన గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, తొలగించడం అత్యంత ఖండనీయం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విగ్రహాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ దౌర్జన్యానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని కోరాం" అని స్పష్టం చేశారు. విక్టోరియా పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగిలించిన కాంస్య విగ్రహాన్ని ఎవరైనా విక్రయించడానికి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్క్రాప్ డీలర్లను హెచ్చరించారు.
ఖలిస్థాన్ ఉగ్రవాదుల కుట్ర?
ఈ దాడి వెనుక ఖలిస్థాన్ అనుకూల శక్తుల హస్తం ఉండవచ్చని 'ది ఆస్ట్రేలియా టుడే' పేర్కొంది. గతంలోనూ ఆస్ట్రేలియాలోని భారత దౌత్య కార్యాలయాలు, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న శక్తులే, ఇప్పుడు అహింసా మూర్తి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. శాంతికి ప్రతీకగా నిలిచే గాంధీ విగ్రహాలను దెబ్బతీయడం ద్వారా భారత-ఆస్ట్రేలియన్ సమాజంలో అలజడి సృష్టించడమే వీరి ఉద్దేశమని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాజంపై దాడిగా అభివర్ణన
విక్టోరియా ప్రతిపక్ష నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించి, భారత-ఆస్ట్రేలియన్ సమాజానికి సంఘీభావం ప్రకటించారు. బహుళ సంస్కృతుల ఐక్యతపై జరిగిన దాడిగా దీనిని అభివర్ణించిన మంత్రి ఎవాన్ మల్హోలాండ్, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. స్థానిక ఎంపీ కిమ్ వెల్స్, మ్యాక్స్ విలియమ్స్ సైతం ఈ దొంగతనం సమాజంలోని గౌరవప్రదమైన విలువలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనను ప్రస్తుతానికి ఏ సిద్ధాంతంతోనూ ముడిపెట్టనప్పటికీ, శాంతి ప్రతీకలను లక్ష్యంగా చేసుకోవడంపై భారతీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకునేందుకు, దోషులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
