
మెట్రోపై స్టాలిన్ నిజాలు దాస్తున్నారు: కేంద్ర మంత్రి మనోహర్ లాల్
కోయంబత్తూరు, మధురై మెట్రో ప్రాజెక్టులను కేంద్రం తిరస్కరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విరుచుకుపడటంపై కేంద్ర గృహ–నగరాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఘాటుగా స్పందించారు. మెట్రో పాలసీ–2017 ప్రకారం తప్పక ఉండి తీరాల్సిన అర్హత వివరాలను, వాస్తవాలను దాచిపెట్టి సీఎం స్టాలిన్ రాజకీయ ఆరోపణలు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని రెండు నగరాల్లో 2011 జనగణనలో 2 మిలియన్ల జనాభా దాటలేదని, ఈ కారణంగానే ప్రాజెక్టులు ఆమోదయోగ్యం కాలేదని కేంద్రం చెబుతుంటే స్టాలిన్ మాత్రం దీనిని బీజేపీ–వ్యతిరేక రాష్ట్రాలపై కేంద్రం ప్రతీకారంగా చిత్రీకరించడం పై విమర్శలు వెల్లువెత్తాయి.
చెన్నై మెట్రోనే పెద్ద ఉదాహరణ
చెన్నై మెట్రో ఫేజ్–2లో 119 కిమీ రూట్‌కు రూ.63,246 కోట్ల భారీ నిధుల ఆమోదం ఇచ్చిన కేంద్రాన్ని స్టాలిన్ పూర్తిగా పట్టించుకోకుండా ‘కేంద్రం అడ్డుకుంటోంది’ అనడం ఆశ్చర్యకరమని మనోహర్ లాల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద మెట్రో మంజూరులలో ఒకటి అని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో ఉన్న ‘అసలు లోపాలు ఇవేనని మంత్రి ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.
కోయంబత్తూరు మార్గం చిన్నది. కానీ ట్రాఫిక్ అంచనాలు చెన్నైకన్నా ఎక్కువగా చేసి చూపారు. అలాగే రోడ్–వేగం, మెట్రో–వేగం తేడా స్పష్టంగా లేకపోవడం, దీని వల్ల మెట్రో వైపు ప్రయాణీకులు మళ్లే అవకాశాలు తగ్గుతాయి. మధురై కాంప్రెహెన్సివ్ మొబిలిటి ప్లాన్ (సీఎంపీ)లోనే ప్రస్తుత రిడర్‌షిప్‌కి మెట్రోకన్నా బీఆర్టీఎస్(బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, మెట్రో రైలుకు చవకైన ప్రత్యామ్నాయం), సరిపోతుందని సిఫార్సు చేశారు. కోయంబత్తూరు సిటీ 257 చ.కి.మీ – జనాభా 15.85 లక్షలు మాత్రమే, కానీ మెట్రో ప్రొజెక్షన్లు 1,287 చ.కి.మీ లోకల్ ప్లానింగ్ ఏరియా ఆధారంగా చూపడం. 5 రెట్లు పెద్ద ప్రాంతాన్ని ఆధారంగా తీసుకోవడం . అంచనాలు సరిగా లేకపోవడం. 7 మెట్రో స్టేషన్ లొకేషన్‌ల వద్ద పూర్తిగా ఆటంకాలు లేకుండా నిర్మించడం కష్టమన్నారు.
పీఎం ‘ఈ–బస్ సేవ’లో భాగంగా 10,000 ఏసీ ఈ–బస్సులు ఇచ్చే సమయంలో కేంద్రం ఆహ్వానించినా తమిళనాడు ఇప్పటివరకు పాల్గొనకపోవడం ఆశ్చర్యకరం అని మంత్రి పేర్కొన్నారు.
బీజేపీ చిన్న రాష్ట్రాలకు మెట్రో… మాకు ఎందుకు రాదు?:స్టాలిన్ కౌంటర్
స్టాలిన్ మాత్రం కేంద్రాన్ని నేరుగా విమర్శించారు. మదురై ‘టెంపుల్ సిటీ’, కోయంబత్తూరు ‘దక్షిణ భారత మాంచెస్టర్’. ఇలాంటి నగరాలకు మెట్రో ఇవ్వకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిన్న చిన్న టయర్–II నగరాలకు మెట్రో ఇవ్వడం శోచనీయం అన్నారు.చెన్నై మెట్రోను కూడా అడ్డుకోవాలని చూశారు. కానీ మేం తీవ్రంగా ప్రయత్నించి సాధించుకున్నాం . మధురై–కోయంబత్తూరు మెట్రో కూడా సాధిస్తాం. తమిళనాడు పోరాడుతుంది… గెలుస్తుంది” అని స్టాలిన్ పోస్ట్ చేశారు.
స్టాలిన్ మాటల్లో నిజమెంత?
మెట్రో పాలసీ–2017 ప్రకారం 20 లక్షల (2 మిలియన్ల) జనాభా కనీస ప్రమాణం ఉన్నప్పటికీ, ఆ ప్రమాణం పూర్తి చేయకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను ఆమోదించింది. వాటిలో
ఆగ్రాలో 2011 జనగణన ప్రకారం జనాభా 17.6 లక్షలు (2 మిలియన్‌కు తక్కువ) అయినప్పటికీ కేంద్రం 2019లో ఆగ్రా మెట్రోను ఆమోదించింది. భోపాల్ లో 2011 జనాభా 17.9 లక్షలు అయినా 2018లోనే మెట్రోకు ఆమోదం తెలిపింది. ఇండోర్ 2011 ప్రకారం జనాభా 19.9 లక్షలు (20 లక్షలకు తక్కువగా) అయినా కూడా 2018–19లో ఆమోదం లభించింది. ఈ మూడు నగరాలూ మెట్రో పాలసీ–2017లో పేర్కొన్న ‘కనీస 20 లక్షల జనాభా’ ప్రమాణాన్ని పూర్తి చేయలేదు. అయినా కేంద్రం ప్రత్యేక పరిస్థితులు, భవిష్యత్ వృద్ధి, రిడర్ షిప్ తదితర కారణాలు చూపించి మెట్రో ప్రాజెక్టులను ఆమోదించింది.
‘2021 జనగణన చేయకపోవడాన్ని కేంద్రం ఆయుధంగా వాడుతోంది. అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు దీన్ని ఒక సాధనంగా మార్చుకుంది’ అని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. జనగణన ఆలస్యం చేసి అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
