
మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
వాట్సాప్, మెటా సంస్థల గోప్యతా విధానాలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డేటా షేరింగ్ పేరిట దేశ పౌరుల గోప్యత హక్కుతో ఆటలాడుకునే హక్కు టెక్ దిగ్గజాలకు లేదని స్పష్టం చేసింది. ఒక్క మాటైనా, ఒక్క సమాచారాన్నైనా పంచుకునేందుకు మేం అనుమతించమంటూ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది. వాట్సాప్ 2021లో అమలు చేసిన ‘తీసుకో లేదా వదిలేయి’ గోప్యతా విధానంపై పోటీ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన రూ.213.14 కోట్ల జరిమానాను సమర్థిస్తూ జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ దాఖలు చేసిన అప్పీల్స్‌పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, విపుల్ ఎం. పంచోలితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే కేసులో ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పులోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ సీసీఐ కూడా అప్పీల్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. డేటా షేరింగ్ పేరుతో ఈ దేశ పౌరుల గోప్యత హక్కును ఉల్లంఘించేందుకు మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలి. లేదంటే కోర్టే ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. భారత్‌లో గోప్యత హక్కు అత్యంత కఠినంగా పరిరక్షింస్తోందని ధర్మాసనం గుర్తుచేసింది. వాట్సాప్ గోప్యతా నిబంధనలు సాధారణ పౌరుడికి అర్థం కాని విధంగా చాలా చాకచక్యంగా రూపొందించారని వ్యాఖ్యానించింది.
‘ నిర్మిత సమ్మతి(బలవంత పరిస్థితుల్లో తీసుకున్న అంగీకారం)’పై ప్రశ్నలు
వాట్సాప్ వినియోగదారుల నుంచి తీసుకుంటున్న సమ్మతి నిజమైనదేనా? లేక బలవంతంగా తీసుకున్నదేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వినియోగదారులను ‘తీసుకో లేదా వదిలేయి’ అనే పరిస్థితిలోకి నెట్టడం ద్వారా తీసుకున్న అనుమతిని న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చీ ‘నిర్మిత సమ్మతి’గా అభివర్ణించారు.
గ్రామీణ వినియోగదారులకు అర్థమవుతుందా?
గోప్యతా నిబంధనల్లో ఉపయోగిస్తున్న క్లిష్టమైన భాషపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు లేదా బీహార్‌లోని ఓ వీధి వ్యాపారి, దూర గ్రామంలో ఉన్న సాధారణ పౌరుడు ఈ చాకచక్యమైన భాషను ఎలా అర్థం చేసుకుంటాడు? అని ధర్మాసనం ప్రశ్నించింది. నిశ్శబ్దంగా ఉన్న వినియోగదారులే ఈ వ్యవస్థలో అసలైన బాధితులని వ్యాఖ్యానించింది.
‘ గోప్యతపై మర్యాదైన దొంగతనం’
వినియోగదారులను ఈ ప్లాట్‌ఫారమ్‌లకు అలవాటు చేసి, నిజమైన ఎంపిక లేకుండా చేయడమే అసలు సమస్య అని కోర్టు పేర్కొంది. ఇది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే మర్యాదైన మార్గంలా ఉంది. భారత్‌లో గోప్యత హక్కును ఉల్లంఘించేందుకు మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం అని సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖను కూడా పక్షంగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 9న మధ్యంతర ఉత్తర్వులు వెలువడనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
‘అగ్రీ’ నొక్కగానే అంతా అప్పగించినట్టే!
వాట్సాప్ వంటి యాప్స్‌లో వినియోగదారుడు ఏమేం అంగీకరిస్తున్నాడు?
వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు కనిపించే కొనసాగించండి / అగ్రీ అనే ఒక్క బటన్ వెనుక, వినియోగదారుడు తెలియకుండానే తన వ్యక్తిగత సమాచారాన్ని విస్తృతంగా పంచుకునేందుకు అంగీకరిస్తున్నాడు. తాజాగా సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.యాప్‌ను ఉపయోగించేందుకు అంగీకారం తెలిపిన వెంటనే, వినియోగదారుడు తన ఫోన్‌లోని కాంటాక్ట్స్, తాను ఎవరితో, ఎంతసేపు మాట్లాడాడన్న మెటాడేటా, అలాగే లొకేషన్ సమాచారం వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తున్నాడు. ఈ డేటా ఆధారంగా వినియోగదారుడి నెట్ వర్క్, అలవాట్లు, ఆసక్తులను అంచనా వేయవచ్చు. అంతేకాదు, చాట్‌లలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రకటనలు చూపించేందుకు కూడా యాప్‌లకు హక్కు లభిస్తుంది.
ఉదాహరణకు, బైక్ గురించి చర్చించిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో బైక్, లోన్ ప్రకటనలు కనిపించడం దీనిలో భాగమే. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ డేటాను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మెటా యాప్‌ల మధ్య పరస్పరం పంచుకునేందుకు కూడా వినియోగదారుడు అంగీకరిస్తున్నాడు. దీంతో పూర్తి డిజిటల్ ప్రొఫైల్ తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో పాలసీలు మారినా ముందుగానే అంగీకరించినట్టుగా భావించడం, అంగీకరించకపోతే సేవలను నిలిపివేయడం వంటి నిబంధనలను కోర్టు ‘నిర్మిత సమ్మతి’గా అభివర్ణించింది. అంటే ఇది స్వేచ్ఛాయుత అంగీకారం కాదని స్పష్టం చేసింది. డేటా షేరింగ్ పేరుతో వినియోగదారుల గోప్యత హక్కులు దెబ్బతినకూడదని సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ, ఈ అంశంపై ఫిబ్రవరి 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపింది.
