
మెగా డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి: ఎంపీ గురుమూర్తి
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు.
సూళ్లూరుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని మెగా డీఎస్సీకి సిద్ధమయ్యారని తెలిపారు. రాత్రింబవళ్లు చదువుతూ, కోచింగ్ తీసుకుంటూ, ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నాపత్రం లీకేజీ, మెరిట్ జాబితా, నియామక నిబంధనల మార్పు తదితర అంశాలపై అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు సంబంధించిన నిబంధనలను మార్చి కొంతమందికి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని అన్నారు. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని కోరారు.
మెగా డీఎస్సీ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని గురుమూర్తి తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని విరమించబోమని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు.
