
మెగాస్టార్ చొరవతోనే జగన్‌ను కలిశాం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏపీలో నిప్పు రాజేశాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా అటు చిరంజీవి అభిమానులు.. ఇటు బాలకృష్ణ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు విసురుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆనాడు వైయస్ జగన్ సినిమా పరిశ్రమ పెద్దలను గౌరవించారా? ఆదరించారా? అవమానించారా? అనే దాని మీద పెద్ద చర్చ మొదలైంది. నాడు ఆ సమావేశంలో పాల్గొన్న పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి దీనిపై స్పష్టతనిచ్చారు. నాడు సినీ ప్రతినిధులను జగన్ అవమానించారని బాలయ్య అసెంబ్లీలో వ్యాఖ్యానించడం తప్పని నారాయణ మూర్తి అన్నారు. జగన్ ఎవర్నీ అవమానించలేదని తెలిపారు. చిరంజీవి చొరవతోనే జగన్‌ను కలిశామన్నారు.
నాటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో జగన్‌ను కలిశామని, తమను సాదరంగా ఆహ్వానించారని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆర్ నారాయణ మూర్తి తన పేరును తాజా ప్రకటనలో చిరంజీవి పేర్కొన్నందున తానూ ఈ అంశం మీద మాట్లాడుతున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాయకులు మాట్లాడిన కామెంట్స్ పై చిరంజీవి మాట్లాడిందే నిజమని స్పష్టం చేశారు. "జగన్‌ను కలిసే ముందు చిరంజీవి నాకు ఫోన్ చేసారు.. చిన్న సినిమాలు, నిర్మాతలు బతకాలి అన్నారు. ఈ విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం గొప్పది. ఈ విషయంలో బాలయ్యకు తెలిసింది బాలయ్య చెప్పారు. కానీ అది వాస్తవం కాదు.
ఆనాడు మమ్మల్ని జగన్ ప్రభుత్వం గౌరవంగానే చూసుకుంది" అని నారాయణమూర్తి అన్నారు. చిన్న సినిమా బతకాలంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చాలని నారాయణ మూర్తి కోరారు. టికెట్ ధరల పెంపు తప్పు అని, సామాన్యుడికి వినోదమైన సినిమాను వాళ్లకు దూరం చేయొద్దని కోరారు. టికెట్ల ధర పెంపు విషయంలో మొదట్లో కేసీఆర్ పెంచను అని తరువాత పెంచారన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా పెంచారని, ఇది సరికాదని చెప్పారు. అప్పట్లో లవకుశ సినిమాకి టికెట్ ధరలు పెంచకపోయినా భారీగా డబ్బులు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా టికెట్ ధర తక్కువగా ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారని అభిప్రాయం వ్యక్తం చేసారు. టికెట్ ధరలు పెంచి సామాన్యుడి మీద భారం మోపడం సరికాదన్నారు.
