
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం
మెక్సికోలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ బహిరంగ ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కోవడం తీవ్ర కలకలం సృష్టించింది. మెక్సికో సిటీలోని చారిత్రక డౌన్‌టౌన్ వీధుల్లో మంగళవారం పౌరులను కలిసి సంభాషిస్తున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
బహిరంగ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో వెనుకనుంచి వచ్చిన ఓ యువకుడు, అధ్యక్షురాలు షీన్‌బామ్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తి ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యంగా తాకాడు. అంతటితో ఆగకుండా, ఆమెను ముద్దు పెట్టే ప్రయత్నం కూడా చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఆ వ్యక్తి అసభ్యంగా తాకడానికి ప్రయత్నించడంతో షీన్‌బామ్ ఒక్కసారిగా షాక్ అయినట్లు, ఆమె ఇబ్బంది పడుతూనే అతని చేతిని పక్కకు నెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో ఆమె నవ్వుతూనే "చింతించకు" అని చెప్పడం గమనార్హం.
భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు
ఈ ఘటన భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. అధ్యక్షురాలు ప్రజల మధ్య ఉన్నప్పటికీ, ఆమె భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంలో విఫలమవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఆ వ్యక్తి అంత దగ్గరకు వచ్చే వరకు భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నారు?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కొంతసేపటికి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని వెనక్కి నెట్టి నిలువరించారు.
నెటిజన్ల ఆగ్రహం
ఈ దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "దేశాధ్యక్షురాలికే నడిరోడ్డుపై భద్రత లేకపోతే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?" అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
కార్యాలయం మౌనం
అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, చమాజీ అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మాదిరిగానే, ప్రజలతో నేరుగా మమేకం కావడానికి, సెల్ఫీలు, కరచాలనాల కోసం తరచుగా గుంపుల్లోకి వెళ్తుంటారు. అయితే ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగినప్పటికీ, ఇప్పటివరకు మెక్సికో అధ్యక్ష కార్యాలయం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
క్లాడియా షీన్‌బామ్.. పశ్చిమ మిచోకాన్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మేయర్ హత్య తర్వాత రాజకీయ హింస గురించి ప్రశ్నలను ఎదుర్కొంటున్న వారంలోనే ఈ సంఘటన జరగడం మెక్సికో రాజకీయాలలో మరింత ఆందోళన పెంచింది.
