
మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం
మెక్సికోలోని సోనోరా రాష్ట్ర రాజధాని హెర్మోసిల్లో నగరం వాల్డోస్ సూపర్ మార్కెట్ లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, నలుగురు బాలురు, మరోక గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణం మొత్తాన్ని ఆవరించడంతో బయటకు రాలేక మృతిచెందినట్లు సమాచారం.
సోనోరా రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ చావెస్ స్పందిస్తూ మంటల వల్ల ఏర్పడిన విషపూరిత వాయువులు పీల్చుకోవడం వల్ల ఎక్కువ మంది మరణించినట్లు ప్రాథమిక దశలో గుర్తించారు. గాయపడిన వారిని నగరంలోని ఆరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల ప్రకటనలో, ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. అయితే, అసలు కారణం ఏమిటన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు అత్యవసర సేవల నిమిత్తం మెక్సికన్ రెడ్‌క్రాస్‌కు చెందిన సిబ్బంది, అంబులెన్స్‌లు వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, ఆ ప్రాంతాలంలోని ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం, ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణం కావచ్చని భావిస్తున్నారు. సంఘటన సమయంలో డే ఆఫ్ ది డెడ్ పండుగ సమయంలో జరగడం అక్కడ ప్రాంత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.
తాజా ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్‌బామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధితుల కుటుంబాలకు, గాయపడిన వారికి తగిన సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నగర పాలక సంస్థ డే ఆఫ్ ది డెడ్ పండుగ కార్యక్రమాలను రద్దు చేసి, బాధిత కుటుంబాలకు సంఘీభావం వ్యక్తం చేసింది.
ఈ అనూహ్య ఘటన నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి రావడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
