
మెక్సికోలో డ్రగ్ లార్డ్ 'ఎల్ మెంచో' హతం
మెక్సికోలో అత్యంత శక్తివంతమైన మాదకద్రవ్య ముఠా 'జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' (సీజేఎన్‌జీ) అగ్రనేత, నెమెసియో రూబెన్ ఓసెగెరా సెర్వాంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' హతమయ్యాడు. మెక్సికో సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో అతడు మరణించడం, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ప్రపంచంలోనే పెద్ద సంచలనంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం మెక్సికోపై ఒత్తిడి తీసుకురావడం, అక్కడి గూఢచారి సంస్థలు మెక్సికో సైన్యానికి అవసరమైన సమాచారాన్ని అందిచడం ఈ ఆపరేషన్‌లో కీలకంగా మారాయి.
‘ఎల్ మెంచో’ ఎవరు?
1966లో జన్మించిన నెమెసియో రూబెన్ ఓసెగెరా సెర్వాంటెస్, తక్కువ కాలంలోనే మెక్సికో నేర ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 'జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' అనే ముఠాను స్థాపించి, ఫెంటనిల్ వంటి ప్రాణాంతక మాదకద్రవ్యాల సరఫరాకు దానిని ప్రధాన కేంద్రంగా మార్చాడు. అమెరికాలో ప్రతి ఏటా వేల సంఖ్యలో జరుగుతున్న డ్రగ్ ఓవర్ డోస్ మరణాల వెనుక ఇతడి వ్యూహాలే ఉన్నాయని అధికారులు భావిస్తారు. ఎల్ మెంచో ఎంత ప్రమాదకరమైన నేరగాడో చెప్పడానికి, అతడిని పట్టుకోవడానికి అమెరికా ప్రభుత్వం ప్రకటించిన 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 83 కోట్లు) భారీ నజరానే నిదర్శనం. సైన్యంపైనే నేరుగా దాడులు చేయడం, హెలికాప్టర్లను కూల్చివేయడం వంటి అత్యంత హింసాత్మక చర్యలకు పాల్పడుతూ, ఎల్ మెంచో ప్రభుత్వ వ్యవస్థలకే పెను సవాలుగా మారాడు.
ఆపరేషన్ జరిగిందిలా..
జాలిస్కో రాష్ట్రంలోని టపల్పా పట్టణంలో ఎల్ మెంచో దాగి ఉన్నాడన్న కచ్చితమైన సమాచారంతో మెక్సికో ప్రత్యేక బలగాలు మెరుపు దాడి చేశాయి. అతడిని సజీవంగా పట్టుకోవడమే లక్ష్యంగా సైన్యం రంగంలోకి దిగినప్పటికీ, కార్టెల్ సభ్యుల నుంచి ఎదురైన తీవ్ర ప్రతిఘటన ఆపరేషన్‌ను మలుపు తిప్పింది. సైన్యంపై జరిగిన కాల్పుల్లో నలుగురు కార్టెల్ సభ్యులు అక్కడికక్కడే మరణించగా, ఎల్ మెంచోతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఎల్ మెంచోను మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఆపరేషన్‌లో రాకెట్ లాంచర్లు, ఆర్మర్డ్ వాహనాలను సైన్యం స్వాధీనం చేసుకోవడం ద్వారా కార్టెల్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎంతటిదో బహిర్గతమైంది. ఈ పోరాటంలో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారు.
దద్దరిల్లుతున్న జాలిస్కో
ఎల్ మెంచో మరణం తర్వాత జాలిస్కో, తమౌలిపాస్, మిచోకాన్, గెర్రెరో, న్యూవో లియోన్ రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. కార్టెల్ అనుచరులు రోడ్లపై వాహనాలను తగులబెట్టి, రాకపోకలను స్తంభింపజేశారు. ఈ అల్లర్ల నేపథ్యంలో పాఠశాలలను మూసివేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.
భారతీయులకు రాయబార కార్యాలయం హెచ్చరిక
మెక్సికోలో నెలకొన్న ప్రస్తుత అశాంతిని దృష్టిలో ఉంచుకుని, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత కోసం భారత రాయబార కార్యాలయం ఒక కీలక సూచన (అడ్వైజరీ) జారీ చేసింది. దీని ప్రకారం, భద్రతా బలగాల కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను పూర్తిగా తగ్గించుకుని సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరింది. ఒకవేళ ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే '911'కు కాల్ చేయాలని లేదా ఏదైనా సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని '+52 55 4847 7539' నంబర్‌లో సంప్రదించాలని సూచించింది. అమెరికా, కెనడా దేశాలు కూడా తమ పౌరులను మెక్సికోలో తక్కువ ప్రొఫైల్ పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
‘ఎల్ మెంచో’ మరణం డ్రగ్ మాఫియాపై మెక్సికో సాధించిన చారిత్రాత్మక విజయం. ఈ పరిణామం ముఠాలో అంతర్గత కుమ్ములాటలకు, కొత్త వారసత్వ పోరుకు దారితీసే ప్రమాదం ఉంది. మాఫియా ప్రతీకార చర్యలు అంతర్జాతీయ భద్రతకు సవాలుగా మారనున్నాయి. రాబోయే రోజుల్లో ఆ దేశంలో శాంతి నెలకొంటుందా లేక హింస మరింత పెరుగుతుందా అన్నది ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తోంది.
