Let's talk: editor@tmv.in
మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం: 13 మంది మృతి, 98 మందికి గాయాలు

మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం: 13 మంది మృతి, 98 మందికి గాయాలు

Shaik Mohammad Shaffee
30 డిసెంబర్, 2025

మెక్సికోలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సలినా క్రూజ్ నుండి కోట్జాకోఆల్కోస్ పట్టణాల మధ్య వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలు వేగంగా వస్తూ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఆ వేగానికి రైలు బోగీలు పక్కకు పడిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికుల్లో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మెక్సికన్ నేవీ అధికారుల సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో రైలులో మొత్తం 250 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన 98 మందిలో, 36 మంది పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. అదృష్టవశాత్తూ మరో 139 మంది ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు.

ఈ ప్రమాదాన్ని తీవ్ర విషాదంగా పేర్కొన్న మెక్సికన్ నేవీ, మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. బాధితులకు అండగా ఉండి, వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.

రంగంలోకి దిగిన సహాయక బృందాలు

ప్రమాదం జరిగిన వెంటనే నేవీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 360 మంది సిబ్బంది, 20 వాహనాలు, నాలుగు అంబులెన్సులతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం మూడు ఎయిర్ అంబులెన్సులను, గాలిలో నుంచి పర్యవేక్షించేందుకు ఒక డ్రోన్‌ను కూడా రంగంలోకి దించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై అధికారులు ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంపై ప్రభుత్వ స్పందన

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ ఈ ప్రమాదంపై స్పందించారు. నౌకాదళ ఉన్నతాధికారులు, మానవ హక్కుల విభాగం ప్రతినిధులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి, బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉండాలని ఆమె ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు మాటియాస్ రొమెరో, సలినా క్రూజ్ వంటి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. సహాయక చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసే బాధ్యతను అంతర్గత వ్యవహారాల శాఖకు అప్పగించారు. కొత్త ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న సమయంలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదం మెక్సికో దేశవ్యాప్తంగా తీరని విషాదాన్ని నింపింది.

మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం: 13 మంది మృతి, 98 మందికి గాయాలు - Tholi Paluku