Let's talk: editor@tmv.in
మూసీ వరద ప్రభావంపై సమీక్ష

మూసీ వరద ప్రభావంపై సమీక్ష

Gaddamidi Naveen
29 సెప్టెంబర్, 2025

హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది. జంట జలాశయాల గేట్లను ఎత్తడంతో వరద ప్రవాహం అధికమైంది. దీనివల్ల మూసీ నది పరివాహక ప్రాంతాలైన చాదర్ ఘాట్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్, మలక్‌పేట ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

చాదర్ ఘాట్ బ్రిడ్జి పరిశీలన

జలాశయాల నుండి భారీగా నీరు విడుదల కావడంతో చాదర్ ఘాట్ బ్రిడ్జి వరద నీటిలో మునిగిపోయింది. అక్కడికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు బ్రిడ్జిని దగ్గర నుండి పరిశీలించి, ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ప్రజలను బ్రిడ్జిపైకి అనుమతించవద్దని పోలీసులను ఆదేశించారు. అంతేకాక బ్రిడ్జి సైడ్ వాల్స్ కొంత మేరకు దెబ్బతినడంతో, వరద తగ్గినా పూర్తిగా మరమ్మత్తులు అయ్యే వరకు అనుమతించవద్దని సూచించారు. అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లోని పలు కాలనీలు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజలను అత్యవసరంగా పునరావాస కేంద్రాలకు తరలించమ‌ని తెలిపారు.

మలక్‌పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను అధికారులు స్వయంగా సందర్శించి, అక్కడి సౌకర్యాలు పరిశీలించారని తెలిపారు. న‌గ‌రంలో నీట మునిగిన ప‌రీవాహ ప్రాంతాలలో వసతి, ఆహారం, వైద్య సహాయం తదితర అవసరాల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను మంత్రి ఆదేశించారు.

ఎంజీబీఎస్ నుంచి బస్సుల మళ్ళింపు

రాత్రి సమయంలో వరద నీరు ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో అక్కడి బస్సులను తాత్కాలికంగా డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏయే మార్గాల్లో బస్సులు వెళ్తున్నాయో స్పష్టంగా తెలియజేయాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి ఆదేశించారు. బస్సు రూట్ల మార్పుపై సమాచారాన్ని ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్‌ను ప‌రిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయం కోసం అధికారులను సంప్రదించాలని కోరారు. ఏ ప్రాంతానికైనా అనవసరంగా వెళ్లొద్దని, వరద ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మూసీ వరద ప్రభావంపై సమీక్ష - Tholi Paluku