Let's talk: editor@tmv.in
మూసీ బాధితుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘పోరుబాట’

మూసీ బాధితుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘పోరుబాట’

Panthagani Anusha
5 ఏప్రిల్, 2026

మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) క్షేత్రస్థాయి పోరాటానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో 'బీఆర్ఎస్వీ పోరుబాట' పేరిట పర్యటనలు నిర్వహించనున్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూసీ నదిని సుందరీకరించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ఆ నెపంతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసం సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తే ప్రజలు సహించరని ప్రస్తుతం మూసీ తీర ప్రాంత ప్రజలు తమ గూడు ఎప్పుడు కూలిపోతుందో తెలియక తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను, ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న 'దోపిడీ' ఆలోచనలను ప్రజలకు వివరించేందుకే తమ బృందాలు రంగంలోకి దిగుతున్నాయని తలసాని పేర్కొన్నారు. సుమారు 50 బృందాలు వారం రోజుల పాటు మూసీ తీర ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి బాధితులకు భరోసా కల్పిస్తాయని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని అవసరమైతే లక్షలాది మందితో ఉద్యమించి ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఇక బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి విభాగం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, బాధితులకు అండగా నిలిచి వారి హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ పర్యటనలతో మూసీ ప్రాజెక్టులోని వాస్తవాలను జనంలోకి తీసుకెళ్తామని నేతలు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.