
మూసీ ప్రాజెక్టు ఫేజ్-2 టెండర్లకు సీఎం రేవంత్ ఆదేశం
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై సీఎం సమీక్షించారు.
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. ఈ ప్రక్రియలో భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మూసీ రివర్‌ఫ్రంట్ పరిధిలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణ సదుపాయాలు కల్పించే అంశంపై మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం అన్నారు. ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీ ప్రక్రియపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. గండిపేట-మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణమే టెండర్లు పిలవాలని సూచించారు. కొత్వాల్‌గూడ పక్షుల పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కాగా, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశ (ఫేజ్-1)లో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్/బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర నదిని అభివృద్ధి చేయనుండగా, దీని అంచనా వ్యయం సుమారు రూ. 6,000 కోట్లుగా ఉంది.
