Let's talk: editor@tmv.in
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని సహించం

మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని సహించం

Gaddamidi Naveen
14 మార్చి, 2026

మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చే పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను స్వాగతిస్తామని, అయితే అభివృద్ధి పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

నదుల ప్రక్షాళన ఎలా చేయాలో గుజరాత్‌లోని సబర్మతి నదిని చూసి నేర్చుకోవాలని రామ‌చందర్ రావు సూచించారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సబర్మతి ప్రక్షాళన కంటే ముందే నిర్వాసితులకు ఇళ్లు కట్టించి, పునరావాసం కల్పించారు. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇళ్లను నేలమట్టం చేస్తోందని ఆయన విమర్శించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ముసుగులో విధ్వంసం చేయడం ఆపాలని డిమాండ్ చేశారు.

దేశంలో ఇంధనం, వంటగ్యాస్‌ (ఎల్పీజీ) సరఫరాపై ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేలా తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని ఆయన సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, 'హార్ముజ్ జలసంధి' మార్గం ద్వారా భారతదేశానికి ఇంధన సరఫరా సురక్షితంగా కొనసాగుతోందని తెలిపారు. ఇది భారత విదేశాంగ విధానానికి, దౌత్య నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు. భారత ఇంధన భద్రత అత్యంత పటిష్టంగా ఉందని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ఆయన భరోసా ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చడానికి ప్రయత్నిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, బాధితుల పక్షాన పోరాడుతామని ఆయన హెచ్చరించారు.

మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని సహించం - Tholi Paluku