
మూసీ పేరిట పేదల ఇండ్లను కూల్చడం రియల్ ఎస్టేట్ దోపిడీయే: మాజీమంత్రి హరీష్ రావు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైదర్షాకోటలో ఉన్న మధు పార్క్ అపార్ట్‌మెంట్ వాసులను ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ నేత కార్తీక్ పట్లొల్ల తదితరులు పాల్గొన్నారు.
మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో కేసీఆర్ అనుబంధం
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో కేసీఆర్‌కు మర్చిపోలేని అనుబంధం ఉందన్నారు. కేసీఆర్ మూడు సార్లు ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చారని, టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూమ్‌ల్లో కూర్చునే రూపొందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అపార్ట్‌మెంట్‌లో మంచినీటి సమస్య తలెత్తినప్పుడు, వెంటనే హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేయించారని చెప్పారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేత బటన్ ఆన్ చేయించి నీటి సరఫరా ప్రారంభించారని వివరించారు. అలాగే సబితా ఇంద్రారెడ్డికి ఒక ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే రోడ్డు వేయించారని, సుధీర్ రెడ్డి మూసీని శుభ్రపరచించి దోమల బెడద తొలగించారని ఆయన తెలిపారు.
కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపు, ప్రజలకు మేలు చేయడం గురించే ఆలోచించారని హరీష్ రావు అన్నారు. ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జేసీబీలతో కూల్చివేతలకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
మూసీ ప్రక్షాళన పేరిట భూదందా..
మూసీ నదిని శుద్ధి చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ దాని ముసుగులో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుకుంటామని హరీష్ రావు తెలిపారు. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మూసీ శుద్ధిని అందరూ కోరుకుంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించిందని చెప్పారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని మూసీలోకి మళ్లించేందుకు డీపీఆర్‌లను కూడా సిద్ధం చేశామని, అయితే అప్పట్లో ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను “ఫోర్త్ సిటీ”గా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లు కూల్చి భూములు స్వాధీనం చేసుకుని పెద్ద పారిశ్రామికవేత్తలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన ఇల్లు ఒక్కటీ లేదని, కూల్చివేతలే జరిగాయని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు - నిధుల దుర్వినియోగం
పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇతర కార్యక్రమాలకు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించారని, ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పేరిట లక్ష కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీలో పోరాటం..
బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలే తప్ప, దాని పేరుతో హింసాత్మక మార్గంలో ఇండ్లు కూల్చడం దుర్మార్గమని హరీష్ రావు అన్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అక్రమాలపై బీఆర్ఎస్ గళమెత్తుతుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు చట్టపరంగా పోరాడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం, మీ అందరినీ కాపాడుకోవడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి పేరిట విధ్వంసం వద్దు: మూసీ బాధితుల ఆవేదన
మూసీ ప్రాజెక్ట్ పరిధిలో మధు పార్క్ ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాకు కేసీఆర్ సర్ మళ్లీ రావాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేము ఇక అంగీకరించలేం. అభివృద్ధి పేరిట విధ్వంసమే జరుగుతోందని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో 450కి పైగా కుటుంబాలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం ఎలా అభివృద్ధి అవుతుందని బాధితులు ప్రశ్నించారు. ప్రభావ నివేదిక ఎక్కడ? ప్రజా నివేదిక ఎక్కడ? అని వారు నిలదీశారు. ఈరోజు మా అపార్ట్‌మెంట్‌కు వచ్చిన పరిస్థితి రేపు ఎవరికైనా రావచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం మాకు అవసరం లేదని, ఇది మా ఇల్లు, మా మౌలిక హక్కు అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
