Let's talk: editor@tmv.in
మూసీ పునరుద్ధరణలో ప్రజల భాగస్వామ్యం: ఆన్‌లైన్ ద్వారా సూచనల స్వీకరణ

మూసీ పునరుద్ధరణలో ప్రజల భాగస్వామ్యం: ఆన్‌లైన్ ద్వారా సూచనల స్వీకరణ

Gaddamidi Naveen
1 ఏప్రిల్, 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఆన్‌లైన్ ద్వారా సూచనలు, సలహాలను స్వీకరించనున్నట్లు మూసీ కేబినెట్ ఉపసంఘం చైర్మన్,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి ఉపసంఘం సభ్యుడు పొన్నం ప్రభాకర్‌తో కలిసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

మూసీ అభివృద్ధి పనులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షత వహిస్తున్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజలు తమ అమూల్యమైన సూచనలను మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు తమ సలహాలను musirrdc@gmail.com ఈమెయిల్ అడ్రస్‌కు పంపవచ్చు. వచ్చే ప్రతి సూచనను క్షుణ్ణంగా విశ్లేషిస్తామని, మంచి సలహాలు ఇచ్చిన వారితో ఉపసంఘం సభ్యులు స్వయంగా దశలవారీగా చర్చలు జరుపుతారని ఆయన పేర్కొన్నారు.

మంచిరేవుల వద్ద మూసీ తీరాన ఓంకారేశ్వర, మల్లేశ్వర ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల భూమి పూజ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి సమగ్రమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

పనుల సమన్వయం, రక్షణ శాఖ అధికారులతో చర్చలు, నిర్వాసిత కుటుంబాలతో సంప్రదింపులు, నిర్మాణ రూపకల్పనల తుది నిర్ణయం, బ్యాంకర్లతో చర్చలు వంటి అంశాలకు బాధ్యతలను విభజించి ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి, కేబినెట్ మొత్తం ప్రాజెక్టుపై కట్టుబడి ఉన్న నేపథ్యంలో అధికారులు ఉత్సాహంతో పని చేయాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు అధికారుల కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులకు ఎలాంటి అవసరాలు ఉన్నా, సూచనలు కావాలన్నా ఉపసంఘం సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటితో కలుషితమైన మూసీని ప్రక్షాళన చేయడమే కాకుండా.. ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరాన అద్భుతమైన ఆలయం, మసీదు, చర్చి, సిక్కు ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.