Let's talk: editor@tmv.in
మూసీ పునరుజ్జీవం భవిష్యత్తు తరాల కోసం: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవం భవిష్యత్తు తరాల కోసం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
15 మార్చి, 2026

మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు ఏ ఒక్క పేదవాడికి వ్యతిరేకం కాదని, నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రజెంటేషన్ సదస్సులో ఆయన పాల్గొని, ప్రాజెక్టు లక్ష్యాలు, మానవీయ కోణాన్ని సుదీర్ఘంగా వివరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇది ఎవరికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రాజెక్టు కాదని, పేదల ఆస్తులను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టును సమర్థంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, నిపుణులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని కోరారు.

మూసీ వెంట నివసిస్తున్న పేద కుటుంబాల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయి డేటా సేకరించిందని సీఎం తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 10 వేల పేద కుటుంబాలు ఉన్నాయని, వారికి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సిద్ధం చేశామని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళితే ఉపాధి కోల్పోతామని కొందరు చెబుతున్నందున సమీప ప్రాంతాల్లోనే నివాస ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్

ఏ పేదవాడిని నిరాశ్రయుడిని చేయబోమని, ఈ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రయోజనాల కోసం కాదని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నదుల పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందినట్లు చరిత్ర చెబుతోందని, ప్రపంచంలోని థేమ్స్, హడ్సన్, సింగపూర్, సియోల్, దుబాయ్ నగరాల అభివృద్ధి కూడా నదుల చుట్టూనే జరిగినట్లు గుర్తుచేశారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలోనే తెలంగాణ కూడా ఆర్థిక ప్రగతి సాధించాలని ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. రాబోయే 25 ఏళ్లలో నగర జనాభా 2.5 కోట్లకు చేరుతుందని, దానికి తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

1908లో మూసీ వరదల సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అప్పటి నిజాం దూరదృష్టితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలాశయాలను నిర్మించారని తెలిపారు. అలాంటి చరిత్రను కొనసాగిస్తూ నగర అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు అవసరమని చెప్పారు. మూసీ నది కాలుష్యం కారణంగా దిగువ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా నల్గొండ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. గాంధీ విగ్రహానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పడం తప్పుదారి పట్టించే ప్రచారమని, దీనికి సుమారు రూ.75 కోట్లకే పరిమితం అవుతుందని చెప్పారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.6,500 నుంచి రూ.7,000 కోట్ల మధ్య ఉండొచ్చని వెల్లడించారు. మూసీ పునరుజ్జీవం ద్వారా పర్యాటక అభివృద్ధి, నైట్ ఎకానమీ, కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ జనాభా భారీగా పెరగనున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

ప్రాజెక్టుపై అన్ని వర్గాల అభిప్రాయాలను స్వాగతిస్తామని, అవసరమైతే శాసనసభలో కూడా దీనిపై చర్చిస్తామని సీఎం తెలిపారు. ప్రజలు వెబ్‌సైట్ ద్వారా తమ సూచనలు ఇవ్వాలని కోరారు. కుట్ర సిద్ధాంతాలు పక్కన పెట్టి అందరూ కలిసి హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

ప్రాజెక్టు పరిధిలో సుమారు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అందులో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.50 కిలోమీటర్లు, అలాగే హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.50 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ప్రాజెక్టు భాగంగా ప్రతిపాదించిన గాంధీ విగ్రహం, అనుబంధ భవనాల నిర్మాణానికి సుమారు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అంగీకరించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ అధికారులకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు పాల్గొన్నారు.

మూసీ పునరుజ్జీవం భవిష్యత్తు తరాల కోసం: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku