
మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువ: హరీశ్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మూసీ సుందరీకరణ, ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ప్రతిపక్షం అడిగిన న్యాయమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, మూసీ కంపును తన నోటి ద్వారా అసెంబ్లీలో పారిస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు ముందు ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం అసలు ఎంత ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రశ్నించారు. ఇప్పటివరకు మూసీ పరివాహక ప్రాంతంలో ఎన్ని ఇండ్లు కూల్చారని, కూల్చిన ఇండ్లకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించారా లేదా అనే విషయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వం, ఎంత ప్రైవేట్ భూమిని సేకరించారో స్పష్టంగా చెప్పాలని అన్నారు.
మూసీలోకి గోదావరి జలాలు ఎక్కడి నుంచి, ఏ మార్గం ద్వారా తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల వరదల సమయంలో మూసీ గేట్లను ఉద్దేశపూర్వకంగా ఒకేసారి తెరిచారని, దాని వల్ల ఇండ్లు, రోడ్లు మునిగిపోయాయని ఆరోపించారు. ఇది కావాలనే ప్రభుత్వ పెద్దలు చేసిన చర్యేనా? ఈ అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా? దీనిపై విచారణ జరిపారా? అంటూ హరీశ్ రావు నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చితే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదని హరీశ్ రావు స్పష్టం చేశారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం పోరాడటమే ప్రతిపక్ష బాధ్యత అని ఆయన అన్నారు.
బీఏసీ నిర్ణయాలపై వివాదం
అసెంబ్లీ నిర్వహణ తీరుపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశంలో సభను కనీసం 7 రోజుల పాటు నడపాలని అందరి సమక్షంలో నిర్ణయించామని, కానీ సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలన్నది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నామని తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపించారు. ఇది సభలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య విలువలు ఏవి? మైక్ కట్ చేయడంపై ఆగ్రహం
స్పీకర్ సభను కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారని విమర్శించారు. క్వశ్చన్ అవర్ లో 10 ప్రశ్నలు ఉంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మైక్ కట్ చేస్తున్నారని, ప్రధాన ప్రతిపక్ష గొంతును నొక్కుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించలేదా? మరి ఇక్కడ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే మైక్ ఎందుకు ఆపేస్తారని ప్రశ్నించారు.
అసెంబ్లీ అజెండాలను అర్ధరాత్రి 2, 3 గంటలకు పంపించడం ద్వారా సభ్యులను మోసం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. సభ ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు ఎజెండా పంపాలన్న సంప్రదాయాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, దీని వల్ల అర్ధవంతమైన చర్చకు అవకాశం లేకుండా పోతోందని ఆయన విమర్శించారు.
సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలపై ప్రతిపక్షం లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదని, సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ సభా గౌరవాన్ని దిగజార్చారని హరీశ్ రావు మండిపడ్డారు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపే ఎక్కువగా ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలతో ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.
