Let's talk: editor@tmv.in
మూసీ ఉగ్ర‌రూపం

మూసీ ఉగ్ర‌రూపం

FL - BRTH
28 సెప్టెంబర్, 2025

మూసీ న‌ది ఉప్పొంగ‌డంతో హైద‌రాబాద్ జ‌ల‌మ‌య‌మైంది. లోత‌ట్టు ప్రాంతాల్లో అవస‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన చోట పున‌రావాసం ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. శుక్ర‌వారం రాత్రి ఎంజీబీఎస్ ను వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది. ప్ర‌యాణీకుల‌ను సుర‌క్షితంగా బ‌య‌టికి తీసుకురావ‌డానికి అధికారులు చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు. ప్ర‌యాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని అధికారుల‌ను కోరారు. వేరే ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ వ‌చ్చే బ‌స్సుల‌ను మ‌ళ్లించి ప్ర‌త్యామ్నాయం చూపాల‌ని చెప్పారు.

శ‌నివారం కూడా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లకు సిద్ధం కావాల‌ని, ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాలు, మూసి ప్ర‌వ‌హిస్తున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, అటువైపు వాహ‌నాలు, ప్ర‌జ‌లు వెళ్ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్‌, రెవెన్యూ యంత్రాంగ రంగంలోకి దిగింది. హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్ మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఎంజీబీఎస్ చేరుకుని అక్క‌డి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ప్ర‌యాణీక‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. మ‌రోవైపు మూసీ ప్ర‌వాహం కొన‌సాగుతూ ఉండ‌టంతో ఎంజీబీఎస్ చెరువులా మారిపోయింది. ఎంజీబీఎస్ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని బాధితుల‌కు స‌హాయ‌క బృందాలు డ్రోన్ల ద్వార ఆహారాన్ని, నీటిని స‌ర‌ఫ‌రా చేశాయి. చాదర్ ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో వ‌ర‌ద ముంచెత్తింది.

మూసీ ఉగ్ర‌రూపం - Tholi Paluku