Let's talk: editor@tmv.in
మూసీపై రాజకీయ ముష్టిఘాతం..అసెంబ్లీలో రగడ

మూసీపై రాజకీయ ముష్టిఘాతం..అసెంబ్లీలో రగడ

Gaddamidi Naveen
19 మార్చి, 2026

తెలంగాణ శాసనసభలో బుధవారం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతోందని, ప్రభుత్వం అస్తవ్యస్తంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ముసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్ ను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పరిశీలిస్తున్నదని తెలిపారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనికి ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ తొలి దశకు డీపీఆర్ తయారీ కోసం 2024 డిసెంబర్‌లో సింగపూర్‌కు చెందిన ఇంజినీరింగ్ సంస్థ మెయిన్‌హార్ట్ ను నియమించామని, వారు ఈ ఏడాది ఫిబ్రవరిలో నివేదికను సమర్పించినట్లు వివరించారు. ఆ డీపీఆర్ ఆధారంగా నిధుల కోసం ఏడీబీకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ప్రాథమికంగా ప్రాజెక్ట్‌పై సానుకూల అభిప్రాయం వ్యక్తమైందని, ప్రస్తుతం పూర్తి స్థాయి ఆమోదం కోసం సమీక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు.

అదేవిధంగా, ఏడీబీ ఆమోదం లభించకపోతే ఇతర సంస్థల సహకారంతో లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ముసీ ప్రస్తుతం మురికి కాలువలా మారిపోయిందని, దాన్ని గడప గడపకూ స్వచ్ఛమైన నీరు అందించే జీవనదిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధమని కూడా చెప్పారు.

బీఆర్‌ఎస్ ఆరోపణలు - రూ. 1.50 లక్షల కోట్ల 'దోపిడీ'

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు అమలుకు ఎన్ని దశలు ఉన్నాయి? ఎన్ని డీపీఆర్‌లు ప్రతిపాదించారు? అన్న విషయాలపై మంత్రి స్పష్టత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వద్ద సరైన ప్రణాళిక గానీ, నిధులు గానీ లేవని కేటీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని ఒక అధికారి చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో రూ. 1.50 లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తూ, నిరసనగా తమ పార్టీ సభ్యులతో కలిసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

పాకిస్తాన్, సింగపూర్ వంటి దేశాల్లో నిషేధానికి గురై, కేసులు ఎదుర్కొంటున్న మెయిన్‌హార్ట్ సంస్థకు ఈ కాంట్రాక్టును ఎలా ఇస్తారని నిలదీశారు.1,400 ఇళ్లు కూలుస్తామని చెప్పి, 10,000 ఇళ్లకు పైగా నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. మూసీని మురికికూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ నివాసితులకు నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ, ముసీ నది ఒడ్డున నివసించే పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నదిని శుభ్రం చేయడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందా అని ప్రశ్నించారు. మూసీని శుభ్రం చేయడాన్ని ప్రతిపక్షం వ్యతిరేకిస్తోందా అని ఆయన నిలదీశారు.

దీనికి ప్రతిగా కేటీఆర్ మాట్లాడుతూ, తమ పార్టీకి ముసీ శుద్ధిపై వ్యతిరేకత లేదని, కానీ ప్రాజెక్ట్ అమలులో పారదర్శకత, స్పష్టత లేకపోవడమే తమ ఆందోళన అని చెప్పారు. ప్రాజెక్ట్ ప్రణాళికలో లోపాలు ఉన్నాయని, సరైన నిధుల ప్రణాళిక కూడా లేదని ఆరోపించారు.

ప్రాజెక్ట్ పేరుతో రూ.1.50 లక్షల కోట్ల “దోపిడీ” జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ముసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తొలి దశ వ్యయం కేవలం రూ.6,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల మధ్య మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, వారికి మూసీ ప్రక్షాళనపై చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం విమర్శించింది. ఈ వివాదంతో అసెంబ్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.