


మూసీపై అపోహలు సృష్టిస్తే ‘శివతాండవమే’: సీఎం రేవంత్ రెడ్డి
కాలుష్య కోరల్లో చిక్కుకున్న మూసీ నదికి పునర్జీవం పోయడమే కాకుండా, ఈ ప్రాజెక్టులో భాగంగా నదీ తీరాన అత్యంత వైభవంగా దేవాలయం, మసీదు, చర్చీ, గురుద్వారాలను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం మంచిరేవుల వద్ద మూసీ నది తీరాన ఓంకారేశ్వర, మచిలేశ్వర (శివ) ఆలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రాజెక్టులో భాగంగా, గండిపేట - మంచిరేవుల పరిధిలోని 14 వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలను రూ. 700 కోట్లతో పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో గోపూజ నిర్వహించి, గోశాలను ప్రారంభించిన సీఎం, మచిలేశ్వర స్వామికి అభిషేకం చేశారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రపంచ ప్రసిద్ధ రామప్ప ఆలయ నమూనాలో అద్భుతంగా నిర్మించనున్నారు. అలాగే నదీ తీరాన 100 అడుగుల ఎత్తైన శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా మూసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం అని తన సంకల్పాన్ని చాటారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని ధ్యానమందిరాలు, సాంస్కృతిక కేంద్రాలతో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మార్చనున్నట్లు వెల్లడించారు. సముద్ర తీరం లేని తెలంగాణలో నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం వల్ల గత తరాలు నష్టపోయాయని, ఇకపై మూసీ తీరాన్ని 'దక్షిణ కాశీ'గా తీర్చిదిద్ది రాష్ట్రానికి కొత్త గుర్తింపు తెస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ఈ సందర్భంగా ముసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌పై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డుపడాలని చూస్తే ప్రభుత్వం “శివ తాండవం” (కఠిన చర్యలు) ఆడుతుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం తమ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని మూసీ నదిని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.
ప్రాజెక్ట్‌లో భాగంగా మంచిరేవుల వద్ద ప్రతిష్ఠాత్మక శివాలయాల సముదాయం నిర్మాణంతో పాటు చార్మినార్ సమీపంలో మసీదు, గౌలిగూడలో సిక్కు సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతంలో అమృతసర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు ప్రేరణగా ఒక గురుద్వారం, నాగోల్‌లో ఒక చర్చి నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ నిర్మాణాలు అన్ని ముసీ నది తీరాల్లోనే ఏర్పాటు చేయబడతాయని చెప్పారు. అన్ని మతాల సమానాభివృద్ధి, సామరస్యానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ముసీ నది కాలుష్య పరిస్థితిని వివరిస్తూ, పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీటి విడుదలతో పాటు నగరంలో నివసిస్తున్న కోట్లాది ప్రజల నుంచి వచ్చే మలినాలు నదిలో కలుస్తున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగే మరణాల వల్ల మానవ మృతదేహాలు, జంతువుల మృతదేహాలు కూడా నదిలో చేరడం పరిస్థితిని మరింత విషమం చేస్తోందని చెప్పారు. ఈ కారణంగా నల్గొండ జిల్లాలో పండే పంటలు మానవ వినియోగానికి అనర్హంగా మారుతున్నాయని, అలాగే పుట్టిన శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.
కాలుష్యంపై ఆందోళన – ఢిల్లీ ఉదాహరణ
ముసీ నది కాలుష్య పరిస్థితిని వివరిస్తూ, మూసీ నదిలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు వల్ల నల్గొండ జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తులు విషతుల్యమవుతున్నాయని, పసిపిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగే మరణాల వల్ల మానవ మృతదేహాలు, జంతువుల మృతదేహాలు కూడా నదిలో చేరడం పరిస్థితిని మరింత విషమం చేస్తోందని చెప్పారు. నిత్యావసర వస్తువుల కంటే మూసీ ప్రక్షాళన ఇప్పుడు అత్యంత అవసరం. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ మురుగునీరు, పారిశ్రామిక కాలుష్యం మూసీలో కలవడం వల్ల పర్యావరణ వ్యవస్థ నాశనమవుతోందన్నారు. కాలుష్యం వల్ల ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే పరిస్థితి ఉందని, తెలంగాణకు అటువంటి దుస్థితి రాకూడదనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మూసీ పనులను నిలిపివేయాలని కేసు వేయడంపై సీఎం మండిపడ్డారు. 40 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన ఆ కుటుంబం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ కేసును వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే వారికి సామాజిక బహిష్కరణ విధిస్తారని హెచ్చరించారు.
గోదావరి జలాలతో మూసీకి జలకళ
మూసీ నదిలో ఏడాది పొడవునా నీరు ప్రవహించేలా చేసేందుకు గోదావరి నది నుంచి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు తరలించే పనులను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నాగరికత ఎప్పుడూ నదీ తీరాల్లోనే విరాజిల్లుతుందని, మూసీని మళ్లీ పాత వైభవానికి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు నగర అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళనకు మద్దతు తెలపాలని, హైదరాబాద్ భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
