
మూలపేట పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: 385 ఎకరాల భూమి బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి చెందుతున్న మూలపేట పోర్టు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక మద్దతు అందించింది. నౌపడా ఉప్పు ఫ్యాక్టరీలోని సుమారు 385.24 ఎకరాల ఉప్పు భూమిని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు బదిలీ చేయడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మూలపేట పోర్టు అభివృద్ధికి పెద్ద ఊతమని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా తీసుకున్న ఈ చర్యను ఆయన స్వాగతిస్తూ, ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ సహకారంతో ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. మూలపేట పోర్టు అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం చంద్రబాబు తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందిస్తూ, మూలపేట పోర్టు అభివృద్ధి వల్ల అనుసంధాన సదుపాయాలు మరింత బలపడతాయని తెలిపారు. రహదారులు, రైల్వే మార్గాల ద్వారా మెరుగైన కనెక్టివిటీ ఏర్పడటం వల్ల సరుకు రవాణా సమర్థవంతంగా జరగనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా అభివృద్ధి దిశగా మరో ముందడుగు అని పేర్కొన్నారు.
మూలపేట పోర్టు సహజంగా 20 మీటర్ల లోతు (డ్రాఫ్ట్) కలిగి ఉండటం వల్ల భారీ నౌకలను స్వీకరించగల సామర్థ్యం ఉంది. సముద్ర తీరానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటం ఈ పోర్టుకు అదనపు ప్రయోజనమని అధికారులు తెలిపారు. 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం ఉన్న నౌకలను స్వీకరించగల ఈ పోర్టు, భవిష్యత్తులో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదగనుందని అన్నారు.
నాలుగు బెర్త్‌లతో నిర్మాణంలో ఉన్న ఈ పోర్టు సంవత్సరానికి సుమారు 15 మిలియన్ టన్నుల సరుకు రవాణా నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందని భావిస్తున్నారు. మూలపేట పోర్టు ప్రాజెక్టు ఒక్క ఆంద్ర రాష్ట్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, దక్షిణ ఒడిశా జిల్లాల అవసరాలను కూడా తీర్చనుందని తెలిపారు.ఈ ప్రాజెక్టు అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం మరింత బలపడనుందని, పోర్టు ఆధారిత ఆర్థిక వృద్ధికి ఇది దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
