
మూఢనమ్మకాలతో బతకడం కాదు.. విజ్ఞానంతో ముందుకు సాగాలి: డిప్యూటీ సీఎం భట్టి
మూఢనమ్మకాలతో బతికే దేశంగా కాదు, విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు సాగే దేశంగా భారతదేశం నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన ఎక్స్ వేదిక ద్వారా, మూఢనమ్మకాల ఆధారంగా జీవించే దేశంగా కాకుండా, శాస్త్రీయ ఆలోచనలను పునాదిగా చేసుకుని అభివృద్ధి దిశగా దూసుకెళ్లే దేశంగా భారత్ నిలవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ముందంజలో ఉండటం అనివార్యం. ఈ శాస్త్రీయ దృక్పథానికి బీజం వేసింది దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అని ఆయన పేర్కొన్నారు.
నెహ్రూ “శాస్త్రీయ దృక్పథం”ను దేశానికి పరిచయం చేస్తూ, పరిశోధనలకు, విద్యకు, సాంకేతిక సంస్థలకు పెద్దపీట వేశారని, ఐఐటీలు, పరిశోధనా కేంద్రాలు, డ్యామ్‌లు, భారీ పరిశ్రమలు వంటి వాటి ద్వారా ఆధునిక భారతదేశానికి బలమైన పునాదులు నిర్మించారని, ఆయన దూరదృష్టి వల్లే భారత్ విజ్ఞానాన్ని ఆశ్రయించిన దేశంగా ఎదగడం ప్రారంభమైందని డిప్యూటీ సీఎం తెలిపారు.
అనంతరం ప్రధాని రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి కొత్త దిశానిర్దేశం చేశారు అని. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్, ఆధునిక సమాచార సాంకేతికతను దేశానికి పరిచయం చేస్తూ, రాబోయే తరాల కోసం భవిష్యత్ భారతదేశానికి బలమైన మౌలిక సదుపాయాలను కల్పించారు అని ఆయన పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా ఉపయోగంలో ఉన్న కంప్యూటర్ వ్యవస్థలు, డిజిటల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఎదుగుదల ఇవన్నీ రాజీవ్ గాంధీ అప్పట్లో తీసుకున్న దూరదృష్టి గల నిర్ణయాల ఫలితమేనని ఆయన చెప్పారు.
ఈ రోజు భారతదేశం అంతరిక్ష రంగంలో ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో చంద్రుడు మనకు దూరం కాదని, మార్స్ కూడా మనకు అందుబాటులోనే ఉందని ప్రపంచానికి నిరూపించిందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సాధించిన ప్రతి విజయం వెనుక శాస్త్రీయ ఆలోచనలతో కూడిన దూరదృష్టి గల నాయకత్వం ఉందన్నది వాస్తవం అని ఆయన సూచించారు.
భారతదేశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచానికి పరిచయం చేసి, అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించిన ఘనత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన తెలిపారు. విజ్ఞానమే మార్గంగా, అభివృద్ధే లక్ష్యంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
