Let's talk: editor@tmv.in
మూడో తరగతి నుంచే ఏఐ పాఠాలు

మూడో తరగతి నుంచే ఏఐ పాఠాలు

Pinjari Chand
31 అక్టోబర్, 2025

దేశంలోని అన్ని పాఠశాలల్లో మూడో తరగతి నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), కంప్యూటేషనల్‌ థింకింగ్‌ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని విద్యామంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పాఠ్యాంశ రూపకల్పనకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, ఎన్‌సీఈఆర్‍టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సంఘటన్‌ (ఎన్వీఎస్)లతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి కృషి చేస్తున్నాయి. శుక్రవారం జరిగిన స్టేక్‌హోల్డర్‌ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎస్‌బీ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ కార్తీక్‌ రామన్‌ (ఐఐటీ మద్రాస్‌) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2025 డిసెంబరు నాటికి కొత్త పాఠ్యాంశాలను, హ్యాండ్‌బుక్స్‌, డిజిటల్‌ వనరులను రూపొందించనుంది.

ప్రతి చిన్నారి ప్రతిభను గుర్తించాలి

విద్యా విభాగ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విద్య అనేది భవిష్యత్‌లో ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యంగా మారబోతోంది. ప్రతి చిన్నారి ప్రత్యేక ప్రతిభను గుర్తించేలా పాఠ్యాంశం రూపొందించాలి అని తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం టీచర్ల శిక్షణ కోసం నిషిత మాడ్యూల్‌లు, వీడియో ఆధారిత లెర్నింగ్‌ వనరులు సిద్ధం చేస్తున్నమన్నారు.

కేంద్ర విద్యా సలహా మండలి చైర్మన్‌ ప్రాచి పాండే మాట్లాడుతూ పాఠ్యాంశ అభివృద్ధి, రోల్‌అవుట్‌ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు.

సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

• మూడో తరగతి నుంచే ఏఐ, కంప్యూటేషనల్‌ థింకింగ్‌ పాఠాలు.

• 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు.

• పాఠ్యాంశాలు ఎన్‌ఈపీ–2020, ఎన్‌సీఎఫ్‌ఎస్‌ఈ–2023 ఆధారంగా.

• టీచర్లకు ప్రత్యేక శిక్షణ.

• డిజిటల్‌ వనరులు, హ్యాండ్‌బుక్స్‌ 2025 డిసెంబరు నాటికి సిద్ధం.