
మూడేళ్లలో అమరావతిని ‘మోస్ట్ లివబుల్ సిటీ’గా తీర్చిదిద్దుతాం: సీఎం
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు ప్రసంగించారు. ఈ సమావేశానికి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతిని రాబోయే మూడేళ్లలో దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. గతంలో కొంతమంది అమరావతిని ‘శ్మశానవాటిక’, ‘ఎడారి’ అంటూ విమర్శించారని గుర్తు చేస్తూ ఆ అపవాదులను తుడిచిపెట్టేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమగ్ర ప్రణాళికతో అమరావతిని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని, జల్ జీవన్ మిషన్‌ను సరిదిద్ది రూ.25 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించే దిశగా ముందుకెళ్తున్నామని గతంలో అస్తవ్యస్తంగా మారిన ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టామని తెలిపారు. వ్యవసాయ రంగంలో డిమాండ్ ఆధారిత పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశామని 5,757 మంది కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. వారి స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచామని వెల్లడించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి: పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తక్కువ ఆర్థిక వనరులతోనే అభివృద్ధి సాధించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సహకారం సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి మార్గదర్శకమని పేర్కొంటూ ఆ దిశగా యంత్రాంగం నిబద్ధతతో పని చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,328 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తొలి విడతలో రూ.2,500 కోట్లు, రెండో విడతలో రూ.5,700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం ‘అడవి తల్లి బాట’ పథకానికి రూ.1,005 కోట్లు నియోజకవర్గాల ప్రాధాన్యత పనులకు రూ.2,123 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనుల అమలుపై తనకు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు ఉదాసీనతను వీడి బాధ్యతతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చయ్యే ప్రతి రూపాయి ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా ఉండాలని సూచించారు.
సంక్షేమ కార్యక్రమాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పవన్ తెలిపారు. 204 అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నార్తుల ఆకలి తీర్చుతున్నామని, గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా డ్రైవర్లకు మేలు చేస్తున్నామని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.1,100 కోట్లతో పంటలను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు 48 గంటల్లోనే రూ.10 వేల కోట్ల చెల్లింపులు చేశామని తెలిపారు.
ఇక భూ సమస్యల పరిష్కారంపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిపాడ్ కోసం ప్రైవేటు భూమిని అక్రమంగా 22-ఏ కింద పెట్టిన ఘటనను ప్రస్తావిస్తూ గతంలో అధికార దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. భూవివాదాలు లేకుండా పకడ్బందీగా సర్వే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.
విద్యుత్ రంగంలో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ దశకు వచ్చామని విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లాభాల బాట పట్టిందని చెప్పారు. విశాఖలో గూగుల్ సహా పలు సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయని మొత్తం 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయని వెల్లడించారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీకి కూడా కార్యాచరణ ప్రారంభమైందన్నారు.
చివరగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ అధికారులను టీమ్ స్పిరిట్‌తో పని చేయాలని, స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ పాలనలో కనిపించాలన్నారు. అవుట్‌డేటెడ్ అవసరం లేని చట్టాలను సమీక్షించి ముందుకు వెళ్లాలని 2026–27 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
