Let's talk: editor@tmv.in
మూడేళ్లలో అన్ని గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మూడేళ్లలో అన్ని గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
11 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రాబోయే మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాలు నిర్మించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన వివిధ శాఖల పనితీరుపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్‌లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, అవసరమైన స్థలాలు ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలను ఒకే సముదాయంగా నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల మెదడు వికాసం కోసం పౌష్టికాహారంతో పాటు సమర్థవంతమైన బోధనా పద్ధతులను అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించి పనులు ప్రారంభించాలని చెప్పారు.

నైపుణ్యాభివృద్ధి - ఉపాధి కల్పన

రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించాలని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “క్యూర్, ప్యూర్, రేర్” విధానాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా కోర్సులను రూపొందించి వాటిని స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ పూర్తిగా గిరిజన ఏజెన్సీల ద్వారానే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ఐటీడీఏల నుంచి పూర్తి సహకారం అందించడంతో పాటు గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా ఆయ‌న సూచించారు.

అలాగే బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. భూ భారతి పథకం ద్వారా రెవెన్యూ సేవల్లో పారదర్శకత పెంచాలని, ప్రజలకు సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రాధాన్యంగా ఆర్థిక వనరుల బలోపేతంపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.