
మూడు రాష్ట్రాల ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి: ఈసీ
కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తెలిపింది. 22 దేశాలకు చెందిన 38 మంది ప్రతినిధులు భారత ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించినట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం నిర్వహించిన ఇంటర్‌నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రాం (ఐఈవీపీ) 2026లో భాగంగా ఈ ప్రతినిధులు భారత ఎన్నికల ప్రక్రియలోని విస్తృత స్థాయి, ఖచ్చితత్వం, పోలింగ్ సరళిని పరిశీలించినట్లు ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రజాస్వామ్య పండుగగా ఎన్నికలు
ప్రతినిధులు భారత ఎన్నికలను ‘ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ’గా అభివర్ణించినట్లు ఈసీ తెలిపింది. అధిక ఓటింగ్ శాతం, ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ ప్రణాళిక, సమర్థ నిర్వహణపై వారు ప్రశంసలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన
ఏప్రిల్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు వారు అస్సాం, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ బృందాల పంపిణీ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులతో, పోలీసు నోడల్ అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించే సీసీటీవీ నియంత్రణ గదులను కూడా వారు సందర్శించారు. ఈ వ్యవస్థ పారదర్శకతకు ముఖ్య ఆధారమని ప్రతినిధులు పేర్కొన్నారు.
అందరికీ అందుబాటులో ఏర్పాట్లు
పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్‌చైర్లు, వాలంటీర్లు, క్రెచ్ సౌకర్యాలు వంటి సదుపాయాలను ప్రతినిధులు ప్రశంసించారు. మహిళలు, వికలాంగులు నిర్వహించిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు కూడా వారిని ఆకట్టుకున్నట్లు ఈసీ తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల నిర్వహణ సంస్థలతో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, భారత ఎన్నికల విధానాలను పరిచయం చేయడం లక్ష్యమని ఎన్నికల సంఘం పేర్కొంది.
