
మూడు రాష్ట్రాల్లో తుది ఓటరు జాబితా విడుదల
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన తుది ఓటర్ల జాబితాను ఈసీఐ శనివారం విడుదల చేసింది. జనవరి 1ను అర్హత తేదీగా తీసుకుని నిర్వహించిన ఈ సవరణలో మొత్తం 1,87,30,914 మంది ఓటర్లు నమోదైనట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. డ్రాఫ్ట్ జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 2,34,994 మంది ఓటర్లు నికరంగా పెరిగినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో 27,196 మంది బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటి సర్వే నిర్వహించి, నమోదు ఫారమ్‌లు పంపిణీ చేసి, ఓటర్ల ధృవీకరణ, మ్యాపింగ్ పనులు పూర్తి చేశారు.
నాలుగు నెలల సవరణ ప్రక్రియ
ఛత్తీస్‌గఢ్ లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం 2025 అక్టోబర్ 27న ప్రారంభమై నాలుగు నెలలు కొనసాగింది. వివిధ దశలు విజయవంతంగా పూర్తయ్యాక ఫిబ్రవరి 21న తుది జాబితా ప్రకటించారు. డిసెంబర్ 23, 2025 నుంచి జనవరి 22, 2026 వరకు పేర్ల చేర్పు, తొలగింపు, సవరణలకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించగా, ఫిబ్రవరి 14 నాటికి వాటి పరిష్కారం పూర్తి చేసినట్లు తెలిపింది.
రెండో దశకు సన్నాహాలు
ఫిబ్రవరి 19న ఈసీఐ 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఏప్రిల్ 2026లో ప్రారంభం కానున్న రెండో దశ ఎస్‌ఐఆర్‌కు అవసరమైన సన్నాహక పనులు వేగవంతం చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ కొనసాగుతోంది. వీటిలో ఛత్తీస్‌గఢ్‌తో పాటు గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన ద్వారా పారదర్శక ఎన్నికల నిర్వహణకు బాటలు వేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఏప్రిల్ 2026లో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) రెండో దశకు సంబంధించి 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సన్నాహక పనులు వేగవంతం చేయాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు సూచించింది.
రెండో దశ ఎస్‌ఐఆర్‌లో ఈ రాష్ట్రాలు ఉండే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్,జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ
ఉత్తరాఖండ్ ఉండనున్నాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన చండీఘర్, దాద్రా నగర్ హవేలి,డామన్ డయ్యూ, లడఖ్, ఢిల్లీ కూడా ఈ దశలో ఉండే అవకాశం ఉంది.
ఎస్‌ఐఆర్ అనంతరం కేరళ, రాజస్థాన్ తుది ఓటర్ల జాబితాలు విడుదల
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యాక కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాలను ఈసీఐ శనివారం విడుదల చేసింది.
కేరళలో 9 లక్షల పేర్లు తొలగింపు
కేరళలో ఎస్‌ఐఆర్ అనంతరం సుమారు 8,97,211 మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,69,53,644గా ఉంది. ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందు ఈ సంఖ్య 2,78,50,855గా ఉండేది.
తాజా జాబితాలో:
1,31,26,048 మంది పురుషులు, 1,38,27,319 మంది మహిళలు, 277 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. అదనంగా 2,23,558 మంది విదేశీ ఓటర్లు, 54,110 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 36.88 లక్షల మందికి నోటీసులు జారీ చేయగా, విచారణల అనంతరం 53,229 మంది తుది జాబితా నుంచి తప్పించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 16 మధ్య సవరణ, చేర్పు, తొలగింపులకు సంబంధించి మరో 4,01,368 దరఖాస్తులు అందినట్లు ఈసీఐ తెలిపింది. ప్రజలు తమ పేర్లు పరిశీలించేందుకు ప్రత్యేక లింక్‌ను ఈసీఐ అందుబాటులో ఉంచింది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి తేదీ వరకు పేర్లు చేర్చుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
రాజస్థాన్‌లో 5.15 కోట్ల ఓటర్లు
రాజస్థాన్‌లో ఎస్‌ఐఆర్–2026 విజయవంతంగా పూర్తై, ఆంటా నియోజకవర్గాన్ని మినహాయించి 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు తుది జాబితా విడుదలైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,15,19,929గా నమోదైంది.
డ్రాఫ్ట్ విడుదల తర్వాత 12,91,365 మంది కొత్త ఓటర్లు చేర్చగా, 2,42,760 పేర్లు తొలగించారు. తుది జాబితాలో 2.69 కోట్ల పురుషులు, 2.45 కోట్ల మహిళలు, 562 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. ఓటర్ల సంఖ్యలో 10.48 లక్షల పెరుగుదల (2.08%) నమోదైంది. జైపూర్ (3.45%), ఫలోది (3.22%), భారత్‌పూర్ (2.78%), సిరోహి (2.72%), బుండీ (2.71%) జిల్లాల్లో అధిక వృద్ధి నమోదైంది. 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 4.35 లక్షలకుపైగా పెరిగింది. లింగ నిష్పత్తి 909 నుంచి 911కు మెరుగుపడింది.
