Let's talk: editor@tmv.in
మూడు నెలల్లో సంక్షేమ హాస్టల్ భవనాలు పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

మూడు నెలల్లో సంక్షేమ హాస్టల్ భవనాలు పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

Gaddamidi Naveen
15 మార్చి, 2026

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. 80 శాతం పనులు పూర్తయిన భవనాలను వచ్చే మూడు నెలల్లోగా సిద్ధం చేసి, రాబోయే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.

శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన బడ్జెట్ ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హాస్టల్ భవనాల మరమ్మతులకు సంబంధించిన బిల్లులను ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్థిక శాఖకు పంపాలని అధికారులను ఆదేశించారు. తద్వారా బిల్లులు త్వరగా క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవి కాలంలో చేపట్టాల్సిన హాస్టల్ మరమ్మతుల పనులను నిర్లక్ష్యం చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.

అదే విధంగా హాస్టళ్ల అద్దె బిల్లులు, విద్యుత్ ఛార్జీలు, కాస్మెటిక్స్ కొనుగోలు ఖర్చులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాలకు సంబంధించిన బిల్లులను కూడా సమయానికి సమర్పించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన చెల్లింపులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇక ఆరోగ్య, అటవీ, ఎండౌమెంట్స్ శాఖల పనితీరుపై కూడా ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా అడవుల సంరక్షణకు ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు. అలాగే చారిత్రక, వారసత్వ ప్రాముఖ్యత కలిగిన ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశాలకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సువర్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని నిర్ణయించిన గడువులో పనులను పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మూడు నెలల్లో సంక్షేమ హాస్టల్ భవనాలు పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి - Tholi Paluku