
మూడు దశల్లో భద్రాద్రి ఆలయాభివృద్ధి
భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించి, రూపొందించిన పలు డిజైన్లను ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ పురాతన వైభవం దెబ్బతినకుండా, పూర్తిస్థాయిలో ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని రూ. 300 కోట్లతో మూడు దశల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, అప్పటికి పూర్తి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించాలని తెలిపారు. పుష్కరాల కోసం రూ. 500 కోట్లు కేటాయించి, భక్తుల సౌకర్యార్థం ఘాట్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు.తొలిదశ అభివృద్ధి పనులను 2027 మార్చి 31 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుష్కరాల అనంతరం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనాలను ఇప్పుడే సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ కీలక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరై తమ సూచనలు అందించారు. భద్రాద్రి రామాలయాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు.
