Let's talk: editor@tmv.in
మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటన.. స్పందించిన సీఎం

మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటన.. స్పందించిన సీఎం

Gaddamidi Naveen
4 డిసెంబర్, 2025

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. సుమారు 10 నుంచి 20 కుక్కలు ఎగబడటంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుక్కల దాడిలో అతని చెవి ఊడిపోవడంతోపాటు తల, నడుము, వీపు భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి.

మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ పత్రికల్లో ఈ ఘటనపై వచ్చిన వార్తను చదివిన వెంటనే సీఎం విచారాన్ని వ్యక్తం చేసి ఆ బాలుడి విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రేమ్‌చంద్ పరిస్థితి తీవ్రంగానే ఉందన్న సమాచారం అందడంతో సీఎం అతనికి అత్యుత్తమ చికిత్స అందేలా చురుకైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బాలుడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సంబంధిత కమిషనర్‌ను సీఎం ఆదేశించారు.

వీధి కుక్కల కట్టడికి చర్యలు

సీఎం కేవలం బాధితుడికి సహాయం అందించడంతో ఆగిపోకుండా, భవిష్యత్తులో ఇలాంటి భయానక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నివారణ చర్యలు తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఎక్కడెక్కడ సమస్య ఎక్కువగా ఉంది?

వీధి కుక్కల బెడద హయత్‌నగర్‌కే పరిమితం కాదు. రాష్ట్రంలోని పలు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదొక నిరంతర సమస్యగానే కొనసాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో వీధి కుక్కల దాడులు, పెరుగుతున్న సంఖ్య, రాత్రివేళ గుంపులుగా తిరుగడం, చిన్నారులు, వృద్ధులకు ప్రమాదం కలిగించడం వంటి ఘటనలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి.

ఎందుకు ఈ సమస్య పెరుగుతోంది?

చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఆహారం అందుబాటులో ఉండటం.డంపింగ్ యార్డులు పట్టణాల మధ్యలో ఉండటం, కుక్కలకు శస్త్రచికిత్స వేగంగా జరగకపోవడం,టీకాల లోపం,కొత్తగా అభివృద్ధి చెందిన కాలనీలలో మునిసిపల్ వనరులు తక్కువగా ఉండటం వీధి కుక్కల బెడద హైదరాబాద్ అర్బన్ ప్రాంతం నుంచి వివిధ జిల్లాల పట్టణాల వరకు వ్యాపించి ఉన్న రాష్ట్రవ్యాప్త సమస్య.

తెలంగాణలో వీధి కుక్కల దాడి: భయపెడుతున్న గణాంకాలు

రాష్ట్రంలో వీధి కుక్కల బెడద వాటి దాడులకు సంబంధించిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.నిత్యం పత్రికల్లో వస్తున్న దాడుల ఘటనలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. 2021లో 24,000 కేసులు నమోదవగా, 2022లో ఈ సంఖ్య భారీగా పెరిగింది.

• 2022లో తెలంగాణలో మొత్తం 80,281 కుక్కల కాటు కేసులు నమోదయ్యాయని భావిస్తున్నారు.

• రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు/సుప్రీం కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం, 2022నుంచి 2024 మధ్య కాలంలో మొత్తం సుమారు 3,33,935 కుక్కల కాటు కేసులు నమోదయ్యాయి.

• ఈ మూడేళ్ల కాలంలో 36 మంది మృతి చెందినట్లు కూడా ప్రభుత్వం అంగీకరించింది.

• మీడియా నివేదికల ప్రకారం, 2025లో రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు 300 కుక్కల కాటు కేసులు నమోదవుతున్నాయి.

ఏబీసీ కార్యక్రమం వైఫల్యం

వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడానికి ఉద్దేశించిన ఏబీసీ (జంతు జనన నియంత్రణ) వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా జరగడం లేదని విమర్శలు ఉన్నాయి. దాడుల సంఖ్య పెరుగుతుండటంతో, ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ప్రభుత్వం ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.