Let's talk: editor@tmv.in
మూక దాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం: కేరళ సీఎం

మూక దాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం: కేరళ సీఎం

Pinjari Chand
23 డిసెంబర్, 2025

దొంగతనం చేశాడన్న అనుమానంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడిపై జరిగిన మూక దాడి (లించింగ్) ఘటన కేరళను కుదిపేస్తోంది. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం హామీ ఇచ్చారు. ఈ దాడి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పాత్ర ఉందని అధికార సీపీఐ(ఎం) ఆరోపించగా, బీజేపీ ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను సీఎం పినరయి విజయన్ తీవ్రంగా కలచివేసే సంఘటనగా పేర్కొన్నారు. ప్రగతిశీల సమాజంగా పేరొందిన కేరళకు ఇలాంటి ఘటనలు మచ్చ తెస్తాయని, ఇవి పూర్తిగా అంగీకరించరానివని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

సిట్ ఏర్పాటు

ఈ కేసును విచారించేందుకు జిల్లా పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం సమీక్షిస్తుందని తెలిపారు.

చికిత్స పొందుతూ మృతి

పాలక్కాడ్ జిల్లా వాలయార్ సమీపంలోని కిళకెట్టప్పల్లంలో ఉద్యోగం కోసం కేరళకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ యువకుడు రాంనారాయణ్‌ (31)పై దొంగతనం చేశాడంటూ బుధవారం స్థానికులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాష్ట్ర మంత్రులు ఎం.బి. రాజేష్‌, కే. రాజన్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం మూక దాడి మాత్రమే కాకుండా జాత్యహంకార దూషణలు కూడా చోటుచేసుకున్నాయని వారు పేర్కొన్నారు. దాడి చేసిన వారు రాంనారాయణ్‌ను బంగ్లాదేశీ అంటూ పిలుస్తూ కొట్టారని తెలిపారు.

విభజన రాజకీయాల ఫలితంగానే

స్థానిక మంత్రి రాజేష్ మాట్లాడుతూ, రాంనారాయణ్‌ను హత్య చేసిన వారు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలేనని ఆరోపించారు. సంఘ్ పరివార్ దేశవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్న విభజన రాజకీయాల ఫలితంగానే ఈ ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. కొంతమంది మీడియా సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్ పాత్రను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఆయన వివరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ కూడా ఈ దారుణం వెనుక ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ కార్యకర్తలే ఉన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలను నమ్మే సమాజం ఇలాంటి క్రూరమైన చర్యలను అంగీకరించదని ఆయన అన్నారు.

ఖండించిన బీజేపీ

అయితే సీనియర్ బీజేపీ నేత కుమ్మనం రాజశేఖరన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘోర నేరాలను రాజకీయాలకు అతీతంగా చూడాలి. మూక దాడిని సామాజిక వ్యతిరేక చర్యగా పరిగణించాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితుడి సోదరుడు రూ.25 లక్షల పరిహారం సహా పలు డిమాండ్లు నెరవేర్చే వరకు మృతదేహాన్ని తీసుకోమని ప్రకటించాడు.

పాలక్కాడ్ ఎస్పీ అజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసును ప్రస్తుతం హత్య సెక్షన్ల కింద నమోదు చేశారు. బాధితుడి కుల ధ్రువీకరణ పత్రం పరిశీలించిన అనంతరం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా వర్తింపజేస్తారు. డీఎస్పీ నేతృత్వంలో 10 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారు ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.