
‘ముహమ్మద్ దీపక్’ను హత్య చేస్తే రూ.2 లక్షల బహుమతి
దీపక్ కుమార్ ఇటీవల జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన పేరు. కోట్‌ద్వార్‌లోని పటేల్ మార్గ్‌లో ఉన్న ‘బాబా’ దుస్తుల దుకాణం పేరును మార్చాలని ఒత్తిడి తెచ్చేందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అక్కడికి చేరిన దీపక్ కుమార్ వారిని ప్రశ్నించారు. తనను తాను ‘ముహమ్మద్ దీపక్’గా పరిచయం చేసుకోవడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం, దీపక్ హత్యకు రూ.2 లక్షల బహుమతి ఇస్తానంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు చేసినట్లు ఆయన ఆదివారం కోట్‌ద్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 351(3) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దీనికి సంబంధించిన వివాదం నేపథ్యంలో జిమ్ యజమాని దీపక్ కుమార్ హత్యకు రూ.2 లక్షల బహుమతి ఇస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. బీహార్‌లోని మోతిహారీకి చెందిన ఉత్కర్ష్ కుమార్ సింగ్ ఈ పోస్టు పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. తన సోషల్ మీడియా ఖాతాకు ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవడానికే ఈ పని చేశానని విచారణలో ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. సాంకేతిక నిఘా, ఇతర సమాచార ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. బీహార్ పోలీసుల సహకారంతో ఉత్కర్ష్ కుమార్ సింగ్‌ను అక్కడి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. విచారణలో, దీపక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా తన ఖాతాకు స్పందన రావడం లేదని, అందుకే వ్యూస్ పెంచుకునే ఉద్దేశంతోనే ఆ పోస్టు పెట్టినట్లు, తనకు ఎలాంటి నేరం చేసే ఉద్దేశం లేదని అతడు చెప్పినట్లు తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, దుకాణం ఎదుట జరిగిన నిరసనలపై కూడా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టారు. వివిధ వనరుల నుంచి సేకరించిన వీడియోలు, ఫోటోల ఆధారంగా దాదాపు 40 మంది ఆందోళనకారుల్లో 15 మందిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వారికి నోటీసులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. కోట్‌ద్వార్ అదనపు ఎస్పీ చంద్ర మోహన్ సింగ్ మాట్లాడుతూ, నగరంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, సోషల్ మీడియా వేదికలపై నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు. జనవరి 26న జరిగిన తొలి ఆందోళన సమయంలో దుకాణ యజమాని వకీల్ అహ్మద్, ఆయన కుమారుడి స్నేహితుడు దీపక్ కుమార్‌తో కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. అనంతరం జనవరి 31న మరోసారి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు దుకాణం, దీపక్ జిమ్ దగ్గరకి వచ్చి రహదారిని దిగ్బంధించారు. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
