
ముస్లింలు రాజకీయంగా ఎదగాలి: ఓవైసీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఏఐఎంఐఎం, హుమాయున్ కబీర్ నేతృత్వంలోని జనతా ఉన్నయన్ పార్టీతో కుదుర్చుకున్న పొత్తు ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు స్వతంత్ర రాజకీయ నాయకత్వాన్ని ఏర్పరచడం అని తెలిపారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ముస్లింల నుంచి స్వతంత్ర నాయకత్వం ఎదిగి బలపడాలి. అదే మా ప్రధాన లక్ష్యం. మేము పోటీ చేసే స్థానాలపై దాదాపు నిర్ణయం తీసుకున్నాం. ఈ కూటమి కేవలం ఈ ఎన్నికలకే పరిమితం కాదు, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇంకా రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలపై మాత్రమే తుది చర్చలు మిగిలి ఉన్నాయని ఆయన చెప్పారు. అది పెద్ద సమస్య కాదు. ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రతినిధిత్వం బలోపేతం చేయడమే మా ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయ నాయకత్వం లేని ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, మానవ అభివృద్ధి సూచికలు చాలా వెనుకబడి ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని ఓవైసీ అన్నారు. అభివృద్ధి, స్వతంత్ర నాయకత్వం మధ్య సహజ సంబంధం ఉందని వ్యాఖ్యానించారు. హుమాయున్ కబీర్ నామినేషన్ సందర్భంగా ఏప్రిల్ 1న తాను పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఆ రోజు భారీ ప్రజా సభ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు బీ-ఫారాలు కూడా అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కబీర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఓవైసీ, ఈ పొత్తు బలంగా కొనసాగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఓవైసీ నాకు అన్నలాంటివాడు
మరోవైపు, హుమాయున్ కబీర్ కూడా ఈ కూటమి బలమైనదని పేర్కొంటూ, ఓవైసీని తన అన్నగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న బెహరంపూర్‌లో తొలి భారీ సభ జరగనుంది. ముర్షీదాబాద్, ఉత్తర బెంగాల్, మాల్దా, బీర్బూమ్, ఉత్తర్ దినాజ్‌పూర్, అసన్సోల్, కొల్‌కతా వంటి ప్రాంతాల్లో ఈ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జేయూపీ పార్టీ మొత్తం 182 స్థానాల్లో పోటీ చేయనుండగా, అందులో సుమారు 8 స్థానాలను ఏఐఎంఐఎంకు కేటాయించనున్నారు.
