Let's talk: editor@tmv.in
ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది ‘ఇండియా’ కూటమి: ఎన్. రామచందర్ రావు

ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది ‘ఇండియా’ కూటమి: ఎన్. రామచందర్ రావు

Gaddamidi Naveen
17 మార్చి, 2026

కాంగ్రెస్ నాయకత్వంలోని 'ఇండియా' కూటమిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని అవమానిస్తూ.. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఆ కూటమి ముస్లింల పక్షాన నిలుస్తోందని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని వ్యాఖ్యానించారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇండీ కూటమిలో భాగమైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కూడా డీఎంకే ముస్లింలకు అండగా ఉంటుందని చెప్పారని గుర్తుచేశారు.

ఈ వ్యాఖ్యలతో ఇండియా కూటమి పార్టీలు మత రాజకీయాలు చేస్తూ ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నాయని రామ‌చంద‌ర్ విమర్శించారు. దేశంలో మెజారిటీగా ఉన్న సనాతన ధర్మాన్ని అవమానించడం సరైన విధానం కాదని అన్నారు. దేశంలోని ముస్లింలు తాము కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించబడుతున్నారనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిం సమాజ అభివృద్ధి నిజంగా ఎవరి పాలనలో జరుగుతోందో కూడా వారు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రధాని న‌రేంద్ర మోదీ తీసుకొచ్చిన “'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్'” సిద్ధాంతం ద్వారా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

ఇక ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ చెన్నైలో డీఎంకే మైనారిటీల విభాగం నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సమాజానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే పార్టీ స్థాపకుడు సి.ఎన్. అన్నాదురై కాలం నుంచే ముస్లింలతో ఆ పార్టీకి బలమైన అనుబంధం ఉందని స్టాలిన్ తెలిపారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంబంధాన్ని ఎవరూ విడదీయలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మతం, ఓటు బ్యాంక్ రాజకీయాలపై చర్చలు మరింత వేడెక్కాయి.