
ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు: నితిన్ గడ్కరీ
బీజేపీ ముస్లింలకు లేదా ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారతీయ సంప్రదాయాలలో ఉన్న ‘వసుధైక కుటుంబం’ అనే భావనను బీజేపీ నమ్ముతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం నాగ్‌పూర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, బీజేపీ కులవాదం లేదా మతవాదాన్ని ప్రోత్సహించే పార్టీ కాదని గడ్కరీ స్పష్టం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రత్యర్థులు పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని అపఖ్యాతి పాలుచేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. ప్రతి వ్యక్తి తన తన విధంగా ఆరాధన చేసుకునే హక్కు ఉందని మా పార్టీ నమ్ముతుంది. ఆరాధన విధానాలు భిన్నంగా ఉన్నప్పటికీ మనందరం భారతీయులమే. మన సంస్కృతి, చరిత్ర, వారసత్వం ఒక్కటే అని ఆయన చెప్పారు. బీజేపీ ఒక నిర్దిష్ట కులానికి చెందిన పార్టీ అని, మహాత్మా గాంధీని హత్య చేసిన వారితో పార్టీకి సంబంధం ఉందని కూడా తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.
భారత్ ఎప్పటికీ సెక్యులర్ దేశమే
ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను ఆయన గుర్తుచేశారు. ఆ ఇంటర్వ్యూలో రచయిత, కవి జావేద్ అక్తర్ వాజ్‌పాయ్‌ని ప్రశ్నిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే భారతదేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతుందా అని అడిగారని గడ్కరీ చెప్పారు. దానికి వాజ్‌పేయి సమాధానంగా, భారతదేశం సెక్యులర్ దేశమే, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ కారణంగా కాదు, హిందూ సమాజం సంస్కృతి, చరిత్ర, సహనశీలత వల్లే అని చెప్పారని గుర్తు చేశారు.
పదవి తాత్కాలికమే.. వినమ్రంగా ఉండాలి
“రాష్ట్రియత్వం, భారతీయత్వమే హిందుత్వం. హిందూ అనేది కులం, మతం, వర్గం కాదు. అది జీవన విధానం. సెక్యులరిజం అసలు అర్థం ‘సర్వధర్మ సమభావం’. అంటే అన్ని మతాలను గౌరవించడం. బీజేపీ ముస్లింలకు లేదా ఇతర మైనార్టీలకు వ్యతిరేకమన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తోందని, స్వచ్ఛమైన తాగునీరు, మంచి రహదారులు, ఉపాధి అవకాశాలు, ఆకలి నుంచి విముక్తి, మంచి జీవన ప్రమాణాలు అందించడమే పార్టీ లక్ష్యమని ఆయన చెప్పారు. పార్టీ స్థాపన నుంచి బీజేపీ చాలా కృషి చేసిందని, కార్యకర్తల నుంచి నాయకత్వాన్ని పెంపొందించే ‘కార్యకర్త సే నేతృత్వ’ సిద్ధాంతంతో భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ తెలిపారు. పదవి తాత్కాలికం. ఆ పదవిలో ఉన్నప్పుడు వినమ్రంగా ఉండాలి. అది ఎప్పుడైనా పోవచ్చు. కానీ బీజేపీ కార్యకర్త అనే గుర్తింపు శాశ్వతమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర నౌకాశ్రయ మంత్రిగా పనిచేసిన సమయంలో తనకు ఇరాన్ పర్యటనలో జరిగిన సంఘటనను కూడా గడ్కరీ గుర్తుచేశారు. చాబహర్ పోర్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయోతుల్లా ఖమేనీతో సమావేశం జరిగిందని చెప్పారు. ఆ సందర్భంగా పర్షియన్ భాష మూలం ఏమిటని ఖమేనీ తనను ప్రశ్నించారని తెలిపారు. తాను తెలియదని చెప్పగా, పర్షియన్ భాష సంస్కృతం నుంచి ఉద్భవించిందని ఖమేనీ చెప్పారని ఆయన వివరించారు. అలాగే తన పూర్వీకులు లక్నో సమీపంలోని ఒక గ్రామానికి చెందినవారని కూడా ఖమేనీ తనతో చెప్పారని పేర్కొన్నారు.
