
ములుగు కలెక్టర్‌ను ఇంగ్లీషులో ఇంటర్వ్యూ చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని,ములుగు జిల్లాలోని చల్వాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ,గోవిందరావుపేట మండలం విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నఈఎల్‌ఎఫ్ అనే ఇంగ్లీష్ లెర్నింగ్ కార్యక్రమం కింద ఈ ముఖాముఖి జరిగింది.కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులు తమ అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కలెక్టర్‌ను ఉత్సాహంగా ప్రశ్నలు అడిగారు.జిల్లా కలెక్టర్ దివాకర్‌ను విద్యార్థులు ఇంగ్లీషులో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్‌ను ఆయన వ్యక్తిగత ఆసక్తులు, ప్రేరణ ఇచ్చిన వ్యక్తులు, ప్రజా సేవలోకి రావడానికి కారణాలు వంటి విభిన్న ప్రశ్నల గురించి అడిగి తెలుసుకున్నారు.ఇంటర్వ్యూ అనంతరం, చిన్నారులు బాలల దినోత్సవం ప్రాముఖ్యతపై ఒక చిన్న రోల్ ప్లే (నాటిక) ను కూడా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
కలెక్టర్ దివాకర్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నారు.చిన్నారులు చూపించిన ధైర్యం, మాట్లాడే తీరు, ఇంగ్లీష్ భాషపై పట్టుదల ఉన్నత స్థాయిలో కనిపించాయి. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కలెక్టర్ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.వారికి సందేశం ఇస్తూ, “విద్యను మీ లక్ష్యంగా పెట్టుకుని, ధైర్యంతో ముందుకు సాగండి అని సూచించారు.ములుగు జిల్లాలో విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఇంగ్లీష్ లెర్నింగ్ కార్యక్రమం 72 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయబడుతోంది.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, భాషా పరిజ్ఞానాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించగల స్థాయికి చేరటం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కూడా ఆనందింపజేసింది.
