
ములుగులో మహిళా సమాఖ్య భవనానికి మంత్రి సీతక్క శంకుస్థాపన
గ్రామీణ స్థాయిలో మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖల మంత్రి దానసరి సీతక్క శనివారం ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామంలో మహిలా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించనున్నారు. ఈ భవనం ద్వారా మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం సహాయక సమూహాల కార్యకలాపాలకు వేదికగా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి సీతక్క చింతలపూడి గ్రామంలో లబ్ధిదారు వినోదకు కేటాయించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు గృహ భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక పురోగతికి మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల అభివృద్ధి, పేదల గృహ నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
