
మున్సిపాలిటీల్లో మన జెండానే ఎగరాలి!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,996 వార్డుల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఏ మున్సిపాలిటీ చూసినా మన జెండానే ఎగరాలి.. ప్రతి వార్డులో మన అభ్యర్థే గెలవాలి అనే నినాదంతో కేడర్‌ను ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ రాజకీయంగా కీలకంగా భావిస్తున్న పార్టీలు, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ ఓటర్లు ప్రభుత్వ పనితీరుపై స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని భావిస్తున్న నాయకులు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల అంశాలను ప్రధాన అజెండాగా చేసుకుని ప్రజల ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాలు, పారిశుధ్యం, పన్నుల భారం వంటి సమస్యలను ఎత్తిచూపుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా స్థానిక సమస్యలపై కేంద్రీకృతమైనప్పటికీ, ఈసారి రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఎన్నికలుగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పెరుగుతున్న యువ ఓటర్లు, మధ్యతరగతి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది. అభివృద్ధితో పాటు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, పట్టణ ప్రణాళికలు వంటి అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి.
అధికార పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పట్టణ ప్రాంతాల్లోనూ పునరావృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఆరు గ్యారెంటీలు' ప్రజా పాలన కార్యక్రమాలకు పట్టణ ప్రజల నుంచి వస్తున్న మద్దతును ఓట్లుగా మలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. ఏ జిల్లాలోని మున్సిపాలిటీల్లోనైనా ఫలితాలు తారుమారైతే ఆ ప్రభావం స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలపై పడుతుందని పార్టీ అధిష్టానం ఇప్పటికే సంకేతాలిచ్చింది. దీంతో ప్రతి పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచార పటాన్ని సిద్ధం చేస్తున్నారు.
తిరుగులేని పట్టు కోసం బీఆర్ఎస్ పోరాటం
గత పదేళ్లలో పట్టణాల అభివృద్ధికి తాము చేసిన కృషిని ప్రజలకు వివరించడం ద్వారా మళ్లీ పురపాలక పీఠాలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు, పట్టణాల్లో మోడల్ మార్కెట్లు, వైకుంఠధామాలు వంటి అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలలో తమ జెండానే ఎగరాలని, ప్రతిపక్షాలకు తావు లేకుండా చేయాలని కేటీఆర్ సహా ముఖ్య నేతలు ఇప్పటికే శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.హైదరాబాద్‌పై తన తిరుగులేని పట్టును నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పోరులో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, ఆ చేదు జ్ఞాపకాన్ని పక్కన పెట్టి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మళ్ళీ దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ వ్యూహరచన చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తమకున్న బలమైన కేడర్ గత పదేళ్ల అభివృద్ధి పనులే గెలిపిస్తాయని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ చేసి, సత్తా చాటాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
గ్రామాల్లో దక్కని ఫలితం.. నగరాల్లో సత్తా చాటేందుకు కమలం వ్యూహం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సర్పంచ్ స్థానాలను సాధించలేకపోయిన బీజేపీ, ఇప్పుడు తన అసలైన బలం ఉన్న పట్టణ ఓటర్లపై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల కంటే నగరాలు, పట్టణాల్లోనే పార్టీకి కేడర్ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో, ఈ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ సవాల్‌గా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్ శాతం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, వికసిత భారత్ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన పురపాలక సంఘాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో లభించిన భారీ మెజారిటీని పురపోరులో ఓట్లుగా మార్చుకునేందుకు అగ్రనేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ పట్టణ సమస్యలపై పట్టున్న వారికే ప్రాధాన్యత ఇస్తూ, మున్సిపల్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరించింది. రాష్ట్రంలో ఇప్పుడు పోటీ కేవలం రెండు పార్టీల మధ్యే లేదని, బీజేపీ కూడా ప్రధాన పోటీదారుగా మారిందని నిరూపించేందుకు ఈ ఎన్నికలను ఒక సవాల్‌గా తీసుకుంది.
ఓటరు తీర్పు ఎవరికి?
తెలంగాణలో రాజకీయం ఇప్పుడు పట్టణాల చుట్టూ తిరుగుతోంది. జనవరి 28 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, ప్రధాన పార్టీల అగ్రనేతలు జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో పట్టణ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఫిబ్రవరి 13న ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందోనని యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
