
మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యం: రామచందర్ రావు
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సమావేశం గురువారం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా రాష్ట్రంలో సాగుతున్న బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను ఈ రెండు ప్రభుత్వాలు వరుసగా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ‘అమృత్’, ‘స్వచ్ఛ భారత్’ వంటి కీలక పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించకపోవడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు.
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ, ములుగు యూనివర్సిటీ వంటి కీలక వరాలను రాష్ట్రానికి అందిస్తోందని గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, బీజేపీ శ్రేణులు అంతా ఏకతాటిపై నిలబడి విజయం కోసం సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పరిమిత స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ గణనీయమైన విజయాలు సాధించిన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు సాధించాలని ఆయన పేర్కొన్నారు.
