Let's talk: editor@tmv.in
మున్సిపల్ ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండాల్సిందే: మంత్రి పొంగులేటి

మున్సిపల్ ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండాల్సిందే: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
23 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ప్రజాప్రతినిధులు కేవలం పదవులకే పరిమితం కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్, పెద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో ఏదులాపురం నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత బాధ్యతల స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు మంత్రి ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రతి ప్రజాప్రతినిధి ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వరకు రాజకీయాలు సహజమే అయినప్పటికీ, గెలిచిన తర్వాత పార్టీ భేదాలు పక్కనపెట్టి ప్రజా ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పదవి అనేది అధికారం కాదని, అది బాధ్యత అని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజల్లో నమ్మకం పెరగాలంటే క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని మంత్రి అన్నారు.

ప్రజలు విశ్వాసంతో ఓటు వేసారని, కేవలం పదవుల్లో కూర్చోవడం సరిపోదని, ప్రజల మధ్య నిరంతరం ఉండాలని సూచించారు. ప్రతి కౌన్సిలర్ వారంలో ఐదు రోజులు, రోజుకు రెండు గంటలు తప్పనిసరిగా తమ వార్డుల్లో పర్యటించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు చురుకుగా ఉంటేనే అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి తెలిపారు.

ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురికినీరు నిల్వ కాకుండా చూడటంతో పాటు నాలాలపై కబ్జాలను అడ్డుకోవడంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. మరో 15 రోజుల్లో సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ప్రతి వార్డు సమస్యలపై కౌన్సిలర్లకు పూర్తి అవగాహన ఉండాలని మంత్రి సూచించారు.

మున్సిపల్ కార్యక్రమం అనంతరం సత్యనారాయణపురంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహప్రవేశ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. కొత్త గృహంలోకి అడుగుపెట్టిన వారికి పట్టు వస్త్రాలను కానుకగా అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.