
మున్సిపల్ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్: 8లో 7 మున్సిపాలిటీలు కైవసం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో 8 మున్సిపాలిటీలలో 7 చోట్ల ఛైర్‌పర్సన్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఒకే ఒక్క మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది.
లక్కీ డ్రాలోనూ కాంగ్రెస్‌దే విజయం
మంగళవారం జరిగిన ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన తొర్రూర్, జనగామ మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సమాన బలం ఉండటంతో ఛైర్మన్ ఎన్నికకు డ్రా నిర్వహించారు. ఈ 'లక్కీ డ్రా'లో అదృష్టం కాంగ్రెస్‌ను వరించడంతో ఈ రెండు కీలక పీఠాలు హస్తం వశమయ్యాయి. తొర్రూర్‌లో మొత్తం 16 వార్డుల్లో బీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి కాంగ్రెస్ సంఖ్య తొమ్మిదికి పెరిగి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో అధికారులు లాటరీ ద్వారా ఛైర్మన్‌ను నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
జనగామలో 30 వార్డులకు బీఆర్‌ఎస్ 13 చోట్ల గెలుపొందగా ఇద్దరు స్వతంత్రులు మద్దతిచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటు కలిగి ఉండటంతో బలం 16కు పెరిగింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఎం1తో కలిపి 13 వార్డులను గెలుచుకుంది. ఇద్దరు స్వతంత్రులు మద్దతివ్వగా భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుతో పార్టీ బలం 16కు చేరింది. దీంతో లాటరీ తీసి విజేతను నిర్ణయించారు. మొత్తం 116 మున్సిపాలిటీలలో 105 మున్సిపాలిటీలకు ఎన్నికలు సోమవారం నిర్వహించగా, ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటలు చోటుచేసుకోవడంతో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు.
ఆ 11 మున్సిపాలిటీలలో ఎనిమిదింటిలో మంగళవారం ఎన్నికలు జరిగాయి. మిగిలిన 3 మున్సిపాలిటీల్లో కోర్టు కేసులు తదితర కారణాలతో ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే ఎత్తివేసినట్లు ప్రకటించింది.
ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 2,582 వార్డులలో కాంగ్రెస్ 1,300కు పైగా వార్డులను గెలుచుకుని ఘనవిజయం సాధించింది. బీఆర్‌ఎస్ సుమారు 700 వార్డులు, బీజేపీ దాదాపు 275 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఇప్పటికే సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 5 చోట్ల మేయర్ పదవులను, అలాగే 81 మున్సిపాలిటీలలో ఛైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకుని ఆధిపత్యాన్ని చాటుకుంది.
