
మున్సిపల్ పోరుకు 28,456 నామినేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి పతాక స్థాయికి చేరింది.రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరగగా, మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల పర్వం మొదటి రోజు పెద్దగా స్పందన కనిపించలేదు. అత్యధిక రద్దీ మాత్రం చివరి రోజున కనిపించింది. జనవరి 30న నామినేషన్ల గడువు ముగిసేలోపు అభ్యర్థులు భారీగా నామినేషన్లు సమర్పించారు. ఒక్క చివరి రోజునే 19,180 నామినేషన్లు దాఖలవడం గమనార్హం. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు, ఈసారి పెద్ద సంఖ్యలో స్వతంత్రులు కూడా బరిలోకి దిగడం విశేషం. చివరి నిమిషం వరకు తమ అనుచరులతో ర్యాలీగా వచ్చి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. దీంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద భారీ రద్దీ నెలకొంది.
నామినేషన్ల దాఖలు ముగియడంతో, తదుపరి దశగా నామినేషన్ల పరిశీలన జరగనుంది. అనంతరం అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసి తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
