
మున్సిపల్ పోరు: ముగిసిన నామినేషన్ల పర్వం
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలతో తరలివచ్చి పెద్ద సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు.
నేడు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అర్హతలు, పత్రాల సరైనతపై ఈ పరిశీలన జరగనుంది. అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన రోజే, అంటే ఫిబ్రవరి 3న సాయంత్రం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలుకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు, పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
